ప్రజాచైతన్య ర్యాలీలో పాల్గొన్న సాయినాథ్‌శర్మ
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ
చెన్నూరు, జనవరి 26: రాష్ట్ర ప్రజలను మోసగించి పరిపాలన సాగించడమే వైసీపీ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ అన్నారు. ప్రజావ్యతిరేక వారోత్స వాల్లో భాగంగా బుధవారం ఆయన చెన్నూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలుపడుతున్నా ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత వాగ్దానాలు, మాయమాటలతో అవ్వ, తాత, అక్కాచెల్లమ్మ అంటూ లేని బంధుత్వాలు కలిపి వైసీపీ నేతలు రాబందుల్లా మారారన్నారు. ఓటీఎస్ పథకంతో బలవంతపు వసూళ్లు, నిత్యావసర ధరల పెంపు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఎంత మాత్రం న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆటో బాబు, శివప్రసాద్, మణికంఠ, కమలాపురం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి రమేష్, తదితరులు పాల్గొన్నారు.