రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-22T05:08:17+05:30 IST

రైతులను అన్ని రకాలుగా అదుకొని రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు.

రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యం

‘రచ్చబండ’లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి 

న్యాల్‌కల్‌/నాగల్‌గిద్ద/నారాయణఖేడ్‌/నర్సాపూర్‌, మే 21: రైతులను అన్ని రకాలుగా అదుకొని రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. శనివారం రాజీవ్‌ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని న్యాల్‌కల్‌ బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు రచ్చబండ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ హయాంలో సుమారు 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వరంగల్‌ రైతు డిక్లెరేషన్‌లో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రైతులకు రూ. 2లక్షల రుణమాఫీతో పాటు కౌలురైతుకు ఎకరానికి రూ. 15వేలు అందజేస్తామన్నారు. భూమి లేని ఉపాధి హామీ కూలీలలకు సంవత్సరానికి రూ.12వేలను అందజేస్తామన్నారు. మూతపడ్డ చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే బీమా అందజేస్తామన్నారు. ధరణి పోర్టును రద్దు చేస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేక రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల వరంగల్‌ కాంగ్రెస్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు బలంగా వినిపించాలని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని కర్‌సగుత్తిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆయన మాట్లాడారు. ఖేడ్‌ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం ఖేడ్‌లో రచ్చబండలో భాగంగా వరంగల్‌లో తీర్మానం చేసిన రైతు డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. రచ్చబండలో భాగంగా నర్సాపూర్‌ మండలం తుజాల్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆంజనేయులుగౌడ్‌, ఆవులరాజిరెడ్డి, రవీందర్‌రెడి,   ఎంపీపీ జ్యోతిసురేష్‌, మండలాధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:08:17+05:30 IST