గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-14T05:23:05+05:30 IST

మహాత్మాగాంధీ సూచించిన గ్రామస్వరాజ సాధనే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని, స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం
సంగారెడ్డిలో జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు

 స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత

 రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 13 : మహాత్మాగాంధీ సూచించిన గ్రామస్వరాజ సాధనే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని, స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. 750 మీటర్ల జాతీయ జెండాతో తీసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను కుల, మతాలకతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం ప్రతీ ఒక్క పౌరుడి బాధ్యతన్నారు. ఓట్ల రాజకీయాలకన్నా తమకు పేదల సంక్షేమమే ముఖ్యమని వెల్లడించారు. రాష్ట్రంలో సంఘ విద్రోహశక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 


ఆహార ఉత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామి


స్వాతంత్య్రం ఏర్పడిన తొలినాళ్లలో ‘అన్నమో రామచంద్రా’ అనే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆహార ఉత్తత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ ముందంజలో ఉన్నదన్నారు. తెలంగాణలో ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త కలెక్టరేట్లు, ఆర్‌డీవో కార్యాలయాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. 57 సంవత్సరాలు నిండిన వారికి ఈ నెల 15 నుంచి ఆసరా పింఛన్లు ఇవ్వబోతున్నామని హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 42వేల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు వివరించారు. సీఎం ప్రకటించినట్లుగా కొత్తగా డయాలసిస్‌ రోగులకు పింఛన్లు అందిస్తామన్నారు.


16న సామూహిక జాతీయ గీతాలాపన 


వజ్రోత్సవాలను దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా సీఎం కేసీఆర్‌ చొరవతో తెలంగాణలో 15రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ జెండాను ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత, 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని సూచించారు. 58 సెక్షన్ల పాటు ఎక్కడివారు అక్కడే నిలుచుని జాతీయ గీతాన్ని అలపించాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 


 

Updated Date - 2022-08-14T05:23:05+05:30 IST