గిరిజనుల వేదన.. అరణ్య రోదన..!

ABN , First Publish Date - 2022-08-08T05:27:21+05:30 IST

ఇలా జిల్లాలో గిరిజనులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల వాసి మారడం లేదు. గిరిజన గ్రామా

గిరిజనుల వేదన.. అరణ్య రోదన..!
అత్యవసర సమయాల్లో డోలీయే గతి

  గిరిజనుల వేదన.. అరణ్య రోదన..!

దశాబ్దాలుగా అవే వెతలు

కానరాని మౌలిక వసతులు

రేపు అంతర్జాతీయ అదివాసీ దినోత్సవం

(మెళియాపుట్టి)

- ఈ ఏడాది మే 16న మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులపై కందిరీగతలు దాడిచేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొండ శిఖర గ్రామం కావడంతో డోలీ కట్టి వ్యయప్రయాసలకోర్చి మైదాన ప్రాంతాలకు తరలించారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనాల్లో మెళియాపుట్టి పీహెచ్‌సీకి తరలించారు. 


- మార్చి 6 గూడ గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. దీంతో కుటుంబసభ్యులు డోలీ కట్టి 8 కిలోమీటర్ల మేర కొండ దించే ప్రయత్నం చేశారు. అయితే  మార్గమధ్యలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తల్లీ బిడ్డలను  అతి కష్టమ్మీద మెళియాపుట్టి పీహెచ్‌సీకి తరలించారు.


- గిరిజన గూడల్లో పింఛన్లు, రేషన్‌ అందించినప్పుడు వలంటీర్లు నరకయాతన పడుతున్నారు. సిగ్నల్‌ లేక మైదాన ప్రాంతాలకు వచ్చి లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుంటున్నారు.గిరిజన ప్రాంతాల్లో సెల్‌ సిగ్నల్‌ లేకపోవడమే ఇందుకు కారణం. నెలనెలా ఇదో ప్రహసనంలా మారిందని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల వాసి మారడం లేదు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు చూపుతున్న గణాంకాలకు...వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. కనీస మౌలిక వసతులు సమకూరడం లేదు. విద్య, వైద్య సేవలు మెరుగుపడడం లేదు. వందలాది కొండ శిఖర గ్రామాలకు కనీస రహదారి సదుపాయం లేదు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం లేదు. జీసీసీ సేవలు వారికి అక్కరకు రావడం లేదు. పాలకుల మాటలు స్వంతన చేకూర్చడం లేదు. ఫలితంగా గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం..

--ఇలా జిల్లాలో గిరిజనులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల వాసి మారడం లేదు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు చూపుతున్న గణాంకాలకు...వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. కనీస మౌలిక వసతులు సమకూరడం లేదు. విద్య, వైద్య సేవలు మెరుగుపడడం లేదు. వందలాది కొండ శిఖర గ్రామాలకు కనీస రహదారి సదుపాయం లేదు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం లేదు. జీసీసీ సేవలు వారికి అక్కరకు రావడం లేదు. పాలకుల మాటలు స్వంతన చేకూర్చడం లేదు. ఫలితంగా గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1,239 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇందులో 39,123 కుటుంబాలకుగాను 1.66,186 మంది జనాభా ఉన్నట్టు గణంకాలు చెబుతున్నాయి. 500 మంది గిరిజన జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. ఈ లెక్కన 68 పంచాయతీలు ఏర్పాటైనా ప్రభుత్వం నిధులు మాత్రం విదిల్చడం లేదు. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

గిరిజన గ్రామాల్లో ప్రధానంగా మౌలిక వసతులు కానరావడం లేదు. మొత్తం 1,256 గిరిజన గ్రామాలకుగాను 120 గ్రామాలకు సరైన రహదారి లేదు. దీంతో అత్యవసర, అనారోగ్య సమయాల్లో గిరిజనులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కనీసం 108, 104 వాహనాలు వెళ్లలేని స్థితిలో రహదారులున్నాయి. రోడ్డు సదుపాయం లేక అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందడం లేదు. అటు రేషన్‌ కోసం గిరిజనులు కొండ దిగువకు రావాల్సి వస్తోంది. తాగునీటి వెతలు అన్నీఇన్నీ కావు. 234 రక్షిత నీటి పథకాలు, గ్రావిటేషన్‌ స్కీములు 115, బావులు 888, బోర్లు 1,498, సోలర్‌ మంచినీటి పథకాలు 210 వరకూ ఉన్నాయి. కానీ ఇందులో చాలావరకూ మరమ్మతులకు గురయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా బాగుచేసిన దాఖలాలు లేవు. విద్యావ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. .47 అశ్రమ పాఠశాలు, 12 గురుకులాలు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 182 వరకూ ఉన్నాయి. అయితే ఇటీవల 82 వరకూ పాఠశాలు విలీనం కావటంతో గిరిజనుల ప్రాథమిక విద్య ప్రశ్నార్థకంగా మారింది. అటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఏజెన్సీలో సిగ్నల్‌ వ్యవస్థ సరిగ్గాలేదు. 339 గ్రామాలు నెట్‌ వర్కుకు దూరంగా ఉంటున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళితే తప్ప వీరికి సెల్‌ సిగ్నల్‌ అందని దుస్థితి. 


 చిన్నచూపు తగదు

గిరిజనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించడం దారుణం. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదు. గిరిజనులు పడుతున్న బాధ వర్ణనాతీతం. వారి సమస్యలను పట్టించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 

-వరహాల కృష్ణారావు, ఏపీ ఆదివాసి సేన రాష్ట్ర కార్యదర్శి  


 బతుకులు మారడం లేదు

దశాబ్దాలుగా గడుస్తున్నా గిరిజనుల బతుకులు మారడం లేదు. మా గ్రామానికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్టు చెబుతున్నారు. అభివృద్ధి పనులైతే కానరావడం లేదు. బిల్లులు మాత్రం చెల్లింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది. 

-ఎస్‌.రాజు, చందనగిరి  


ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనులకు ఒనగూరే ప్రయోజనాలు మాత్రం కానరావడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చూపుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గ్రహించాలి. 

అడ్డయ్య, చందనగిరి 




Updated Date - 2022-08-08T05:27:21+05:30 IST