ఆ ఒక్కరు.. రెండు చోట్ల..!

ABN , First Publish Date - 2022-08-20T06:16:15+05:30 IST

డ్వామా పరిధిలో ఎంపీడీఓల పదోన్నతి బదిలీల్లో వింతలు చోటు చేసుకున్నాయి.

ఆ ఒక్కరు.. రెండు చోట్ల..!
బదిలీ అయినా ఇక్కడే ఉన్నట్లు ఓ అధికారి నేమ్‌ బోర్డు

డ్వామా బదిలీల్లో వింత పోకడ

ఎఫ్‌టీఈలు ఉన్న చోట 

ఎంపీడీఓల నియామకం

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 19: డ్వామా పరిధిలో ఎంపీడీఓల పదోన్నతి బదిలీల్లో వింతలు చోటు చేసుకున్నాయి. డ్వామాలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్న ముగ్గురు ఏపీడీల స్థానం లో పదోన్నతి పొందిన ఎంపీడీఓకు పోస్టింగ్‌ ఇవ్వడంతో వివాదానికి తెరలేచింది. డ్వామా ఎఫ్‌టీఈల (ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌) స్థానంలో రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ పదోన్నతి పొందిన ఎంపీడీఓలను నియమించలేదు. ఇక్కడ మాత్రమే రాజకీయ జోక్యంతో ముగ్గురిని ఏపీడీ స్థానాల్లో నియమించారు. 

-- గుత్తి క్లస్టర్‌, బుక్కరాయసముద్రం క్లస్టర్‌, మడకశిర క్లస్టర్‌ ఏపీడీలు డ్వామాలో 20 ఏళ్ళుగా ఎఫ్‌టీఈలుగా పనిచేస్తున్నారు. బుక్కరాయసముద్రం క్లస్టర్‌కు డ్వామా కార్యాలయంలో ఏఓగా ఉన్న ఎంపీడీఓను బదిలీ చేశారు. ఆ అధికారి (మహిళ) అక్కడ ఉన్న ఏపీడీనీ రిలీవ్‌ చేస్తూ, బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, డ్వామాలో ఉన్న పోస్టును అంటిపెట్టుకుని  ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఓ నాయకుడి పలుకుబడితో రెండు పోస్టుల్లోనూ తానే ఉంటున్నారని సమాచారం. డ్వామాలో పనిచేస్తున్న ఇతర అధికారులు బయటికి ప్రశ్నించలేకున్నా, లోలోన విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి నుంచి ఆమె తోటి ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని ఇబ్బంది పెట్టారని అంటున్నారు. బదిలీపై వేరేచోట పోస్టింగ్‌ ఇచ్చినా, తిరిగి ఇక్కడే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, కలెక్టర్‌ను తప్పు దోవపట్టిస్తూ, సొంత నిర్ణయాలతో ఆమె కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మిగిలిన అధికారులు ఆయా స్థానాల్లో చేరినా, ఇతర పోస్టుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

-- ఎఫ్‌టీఈల విషయంలో రాజకీయ రంగు పులుముతున్నారని, కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఎంపీడీఓలలో రామాంజినేయులును డ్వామా ఉపాధి హామీ పథకం ఏపీడీ, శ్రీసత్యసాయి జిల్లా ఇనచార్జి పీడీగా నియమించారు.ద ఈంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో ఎంపీడీఓ వెంకటనాయుడు ఎఫ్‌ఎంగా బాధ్యతలు చేపట్టారు. డీవీఓగా రమణారెడ్డి, కళ్యాణదుర్గం ఎపీడీగా రమే్‌షనాయక్‌, ఉరవకొండ ఏపీడీగా రమే్‌షబాబు, డ్వామా అకౌంట్స్‌ ఏపీఓగా శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆ ఒక్క అధికారిని మాత్రం ఎందుకు అంతగా మోస్తున్నారో అర్థం కావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా డ్వామా జిల్లా అధికారులు నోరుమెదపకపోవడం గమనార్హం.

Updated Date - 2022-08-20T06:16:15+05:30 IST