పట్టు తప్పితే అంతే!

ABN , First Publish Date - 2021-12-09T04:32:43+05:30 IST

రహదారి ప్రయాణంలో వంతెనలు కీలకం. నదులు ఉన్నచోట్ల వాటి భద్రత మరింత ముఖ్యం. పట్టు తప్పితే ఆ ప్రమాదాన్ని.. నష్టాన్ని ఊహించలేం. అటువంటి వంతెనల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొన్నింటికే నిధులు మంజూరు చేసింది.

పట్టు తప్పితే అంతే!
శిథిల స్థితిలో పారాది వంతెన

జిల్లాలో శిథిలమవుతున్న వంతెనలు

అరకొరగా నిర్మాణాలు

పారాది వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి

కూలే స్థితిలో వేగావతి.. జంఝావతి బ్రిడ్జిలు


రహదారి ప్రయాణంలో వంతెనలు కీలకం. నదులు ఉన్నచోట్ల వాటి భద్రత మరింత ముఖ్యం. పట్టు తప్పితే ఆ ప్రమాదాన్ని.. నష్టాన్ని ఊహించలేం. అటువంటి వంతెనల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొన్నింటికే నిధులు మంజూరు చేసింది. మిగతా వాటి పరిస్థితిని కనీసం పరిశీలించడం లేదు. జిల్లాలో ప్రధానమైన పారాది వంతెన ప్రమాదకర స్థితిలో ఉంది. వేగవతి, జంఝావతిపై ఉన్న బ్రిడ్జిలు కూడా శిథిలమవుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నదులపై వంతెనలు నిర్మించేందుకు అరకొరగా నిధులు విడుదలయ్యాయి. కేవలం రెండు వంతెనల వద్దే పనులు చేపట్టారు. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి అంతర్‌ రాష్ట్ర రోడ్డు మార్గంలో జిల్లా శివారున ఉన్న కొమరాడ మండలం కూనేరు వెళ్లాలంటే మధ్యలో నాలుగు వంతెనలున్నాయి. అన్నీ శిథిలావస్థకు చేరుకోగా  రెండు చోట్ల నిర్మాణాలు  చేపట్టారు. మరో రెండింటిని విస్మరించారు. పనులు జరుగుతున్న బ్రిడ్జిలు కూడా ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వేగావతి, జంఝావతి నదులపై బ్రిటీష్‌ కాలం నాటి వంతెనలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకుని ఏక్షణంలో కూలుతాయో అన్నట్టుగా తయారయ్యాయి. ఇన్నాళ్లూ రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మానాపురం ఫ్లైఓవర్‌ వంతెన మినహా మిగిలినవి పూర్తి చేశారు. ఇదే సమయంలో నదులపై పాత వంతెనల స్థానే కొత్త వాటిని నిర్మించాల్సి ఉంది. వీటి ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. 

 బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలో కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాత వంతెనలన్నింటిపైనా ఒకేదారిలో అన్ని వాహనాలు వెళ్లాలి. చాలాసార్లు ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. దీంతో పోలీసులను నియమించి వాహనాల రద్దీని అదుపు చేస్తున్నారు. పోలీసులు లేనిపక్షంలో ఎవరికినచ్చినట్లు వారు వంతెన వద్ద వెళ్లి ట్రాఫిక్‌ జామ్‌కు కారకులవుతున్నారు. పారాది వంతెన కూలే స్థాయికి చేరిపోయింది. వర్షం పడితే వంతెనపైనే అధికంగా నీరు నిలిచిపోతోంది. 

 ఒడిశాలోని రాయగడ వెళ్లాలంటే కొమరాడ మండలం కోటిపాం వద్ద జంఝావతి నది దాటాలి. ఈనదిపై బిటీష్‌ కాలం నాడు 1928లో నిర్మించిన వంతెనే ఆధారం. ఇది కూడా శిఽథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు వంతెనల నిర్వహణను సరిగా చూడడం లేదు. 

అరకొరగా నిధులు

సీతానగరం మండల కేంద్రం వద్ద సువర్ణముఖీ నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. రూ.10.5 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. మొత్తం తొమ్మిది పిల్లర్లతో కూడిన స్పాన్లు ఏర్పాటు చేయడం ద్వారా వంతెన పనులు చేపట్టారు. నిధులు సరిపోవంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, నదులకు వచ్చిన వరదల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చంపావతి నదిపై గజపతినగరం వద్ద వంతెనకు మోక్షం కలుగుతోంది. గజపతినగరం నుంచి సాలూరు వరకు సుమారు 30కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం రూ.170 కోట్లు మంజూరు చేసింది. ఈ రెండు మినహా మిగతా నదులపైనున్న వంతెనలు కూలిపోయే స్థితికి చేరాయి. వాటికికూడా నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-12-09T04:32:43+05:30 IST