రాచరికాన్ని అవమానించిన మహిళ.. 60 ఏళ్ల వయసులో 43 ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-01-20T01:03:58+05:30 IST

గత రికార్డులను చెరిపివేస్తూ థాయిలాండ్‌లోని క్రిమినల్ న్యాయస్థానం ఓ మహిళకు ఏకంగా 43 ఏళ్ల జైలు శిక్ష

రాచరికాన్ని అవమానించిన మహిళ.. 60 ఏళ్ల వయసులో 43 ఏళ్ల జైలు శిక్ష

బ్యాంకాక్: గత రికార్డులను చెరిపివేస్తూ థాయిలాండ్‌లోని క్రిమినల్ న్యాయస్థానం ఓ మహిళకు ఏకంగా 43 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కారణం.. రాచరికాన్ని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే.  ‘బ్యాంకాక్ పోస్ట్’ కథనం ప్రకారం.. నిజానికి ఆ మహిళకు కోర్టు తొలుత 87 ఏళ్ల జైలుశిక్ష విధించింది.  అయితే, విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో శిక్షా కాలాన్ని 43 సంవత్సరాల 6 నెలలకు తగ్గించారు. 2018లో ఆమె బెయిలుపై విడుదల కావడానికి ముందు దర్యాప్తు నిమిత్తం మూడు సంవత్సరాల 9 నెలలు నిర్బంధంలో ఉంది. మొత్తం జైలు శిక్షలో ఈ కాలాన్ని తీసివేయనున్నారు. 


అంచన్ అనే మహిళ రాచరికాన్ని అవమానిస్తూ 2015లో 26 సందర్భాల్లో యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసింది. 2014-15 మధ్య ఫేస్‌బుక్‌లో మూడుసార్లు వీడియోలు అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోల్లో ఉన్న గొంతు రాచరికాన్ని తీవ్రంగా విమర్శించే బన్‌పోడ్జ్‌ది. (అసలు పేరు కాదు). 2014లో మిలటరీ తిరుగుబాటుకు ముందు, ఆ తర్వాత కొంతకాలం పాటు  యూట్యూబ్, ఇతర ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్లలో ఆయన చురుగ్గా ఉండేవాడు.


60 ఏళ్ల వయసున్న అంచన్ ప్రభుత్వ మాజీ ఉద్యోగి. కంప్యూటర్ నేరాల చట్టాన్ని ఉల్లంఘించిన అభియోగాలు కూడా ఆమెపై నమోదయ్యాయి. తొలుత తనపై వచ్చిన వార్తలను ఖండించిన అంచన్, విచారణలో మాత్రం అంగీకరించింది. దీంతో ఆమె శిక్షా కాలాన్ని తగ్గించారు.  

Updated Date - 2021-01-20T01:03:58+05:30 IST