రామాలయం భూమిపూజకు ఉద్ధవ్ థాకరే దూరం?

ABN , First Publish Date - 2020-08-03T23:05:57+05:30 IST

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఈ నెల 5న జరిగే భూమిపూజ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి...

రామాలయం భూమిపూజకు ఉద్ధవ్ థాకరే దూరం?

ముంబై: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఈ నెల 5న జరిగే భూమిపూజ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. యూపీలోని ఈ పట్టణంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రబలుతున్నందున ఉద్ధవ్ ఈ కార్యక్రమానికి వెళ్లకపోవచ్చునని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ పరోక్షంగా వెల్లడించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి వెళ్లడం ముఖ్యం. సీఎం థాకరే కూడా ఏదో సమయంలో వెళ్తారు. భూమిపూజ కార్యక్రమం నిరాటంకంగా జరగాలి..’’ అని రావత్ వ్యాఖ్యానించారు. అయోధ్య రామలయం నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామనీ.. ఆలయ నిర్మాణం కోసం శివసేన పార్టీ ఇప్పటికే కోటి రూపాయలు విరాళం ఇచ్చిందని రావత్ గుర్తుచేశారు. ‘‘అయోధ్య సహా పరిసర ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. కరోనా కారణంగా ఉత్తర ప్రదేశ్ మంత్రి కమలారాణి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు మంత్రులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నాకు తెలిసి అక్కడికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది. ప్రస్తుతం ప్రధాని మోదీ వెళ్లడం ముఖ్యం. థాకరే మరెప్పుడైనా వెళ్తారు..’’ అని రావత్ పేర్కొన్నారు.


కాగా సీఎం థాకరేకి ఆహ్వానం అందలేదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ‘‘ఆహ్వానం కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు..’’ అని పేర్కొన్నారు. ‘‘ఆలయ ప్రధాన అర్చకుడు, సెక్యురిటీ గార్డులు క్వారంటైన్లోకి వెళ్లారు. కాబట్టి ఆహ్వానించకపోవడాన్ని మేము రాజకీయం చేయదల్చుకోలేదు. అయోధ్యలో పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఒక రకంగా అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. మీరేమో ఎవరెవరు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది. ఆలయ నిర్మాణం కోసం పెద్దఎత్తున పోరాటం చేసిన బీజేపీ సీనియర్ నేతలు అడ్వాణీ, ఎంఎం జోషి కూడా కొవిడ్-19 నేపథ్యంలో భూమిపూజకు వెళ్లడం లేదు...’’ అని గుర్తుచేశారు. కాగా ‘‘బాబ్రీ మసీదును పడగొట్టడం’’ ద్వారా అయోధ్య రామాలయం కోసం శివసేన ఎప్పుడో పునాది వేసిందనీ.. శివసైనికులే ‘‘మసీదును కూల్చేశారని’’ బీజేపీ, వీహెచ్‌పీ నేతలే అంగీకరించారని రావత్ పేర్కొన్నారు. ‘‘మేము ఆలయానికి ఎప్పుడో పునాదులు వేశాం. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. రామాలయ నిర్మాణం కోసం ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రూ.1 కోటి విరాళం కూడా ఇచ్చారు..’’ అని రావత్ అన్నారు. 

Updated Date - 2020-08-03T23:05:57+05:30 IST