పాఠ్య పుస్తకాలొచ్చాయ్‌..

ABN , First Publish Date - 2022-06-30T06:18:50+05:30 IST

మండల పరిధిలోని ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ, ఆశ్రమోన్నత పాఠశాలలకు ప్రభుత్వం నుంచి సుమారు 95 వేల పాఠ్య పుస్తకాలు రావలసి ఉండగా, మొదటి విడతలో 41,713 పుస్తకాలు మాత్రమే వచ్చాయి.

పాఠ్య పుస్తకాలొచ్చాయ్‌..
అరకులోయ కొండవీధి పాఠశాల నుంచి పాఠ్య పుస్తకాలను కొత్తభల్లుగుడ హెచ్‌ఎం మంగకు అందజేస్తున్న మండల విద్యాశాఖ సిబ్బంది

మండల కేంద్రానికి తొలి విడత చేరిన 41,713 పుస్తకాలు

రావలసినవి మరో 53,287 

8వ తరగతి పుస్తకాలు నిల్‌


అరకులోయ, జూన్‌ 29: మండల పరిధిలోని ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ, ఆశ్రమోన్నత పాఠశాలలకు ప్రభుత్వం నుంచి సుమారు 95 వేల పాఠ్య పుస్తకాలు రావలసి ఉండగా, మొదటి విడతలో 41,713 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జూలై 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తొలి విడతగా 41,713 మాత్రమే రాగా, మరో 53,287 పుస్తకాలు రావలసి ఉంది. ప్రస్తుతం మండల కేంద్రానికి చేరిన పాఠ్య పుస్తకాలను బుధవారం మండల విద్యాశాఖ సిబ్బంది ఆశ్రమోన్నత పాఠశాలలైన బస్కీ, కొత్తభల్లుగుడ, అరకులోయ క్రీడా పాఠశాల, అరకులోయ పీవీటీజీ గురుకుల బాలుర ఉన్నత పాఠశాల, నందివలస అప్పర్‌ ప్రైమరీ పాఠశాలకు అందజేశారు. అయితే 8వ తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు ఒక్కటీ  రాలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రావడం కష్టమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-30T06:18:50+05:30 IST