పది పరీక్షలు షురూ

ABN , First Publish Date - 2022-05-24T05:16:14+05:30 IST

జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు విద్యార్థులందరు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సెట్‌ నంబర్‌ 1 పరీక్షా పత్రాన్ని కేటాయించగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఎదుట పరీక్ష పత్రాలను తెరిచారు. జిల్లాలో 83 పరీక్ష కేంద్రాల్లో 14,923 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 58 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో వివిధ కారణాలతో పరీక్ష రాయలేని ముగ్గురికి స్ర్కైబ్‌కు అనుమతి ఇచ్చారు.

పది పరీక్షలు షురూ
ములుగులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ హన్మంతరావు

83 కేంద్రాల్లో పరీక్ష రాయాల్సిన 14,923 విద్యార్థులు 

తొలిరోజు 58 మంది గైర్హాజరు

ముగ్గురు విద్యార్థులకు సహాయకులకు అనుమతి


సిద్దిపేట క్రైం, మే 23 : జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు విద్యార్థులందరు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సెట్‌ నంబర్‌ 1 పరీక్షా పత్రాన్ని కేటాయించగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఎదుట పరీక్ష పత్రాలను తెరిచారు. జిల్లాలో 83 పరీక్ష కేంద్రాల్లో 14,923 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 58 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో వివిధ కారణాలతో పరీక్ష రాయలేని ముగ్గురికి స్ర్కైబ్‌కు అనుమతి ఇచ్చారు. వికలాంగులు, అంధులు, అనారోగ్యంగా ఉన్నవారి పరీక్షను 9వ తరగతి విద్యార్థులు రాయడానికి (స్ర్కైబ్ర్‌) అధికారులు  అనుమతి ఇస్తారు. ఈమేరకు వారు నోటితో చెప్తుండగా ఇతర విద్యార్థులు పరీక్ష రాశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వికాస్‌ స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని స్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమె ఇందిరానగర్‌ హైస్కూల్‌ సెంటర్‌లో పరీక్ష రాయాల్సి ఉన్నది. ఆమె పరీక్షను ఇందిరానగర్‌ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అక్షిత రాయడానికి అనుమతి ఇచ్చారు. తొగుట జడ్పీఎచ్‌ఎ్‌సకు అంధ విద్యార్థి కొమ్ము హరికృష్ణ గణపురం హైస్కూల్‌ సెంటర్‌లో పరీక్ష రాయాల్సి ఉండగా అదే స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి మహే్‌షరెడ్డి ఆయనకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వికాస్‌ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి శివతేజస్విని అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ సెంటర్‌లో పరీక్ష రాయాల్సి ఉననది. దీంతో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అక్షితరెడ్డి రాయడానికి అనుమతి ఇచ్చారు. అలాగే, హుస్నాబాద్‌లోని మోడల్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి తండ్రి అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే బాధను దిగమింగుకుంటూ పరీక్ష రాశాడు. మండలంలో జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతిచెందారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం సోమవారం విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు.


పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ములుగు, మే 23: ములుగు జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం కలెక్టర్‌ ఎం.హనుమంతరావు తనిఖీ చేశారు. విద్యార్థుల  ఓయంఆర్‌ షీట్‌ను, పశ్నాపత్రాలను పరిశీలించారు. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్‌లను తీసుకురాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలకు హజరయిన విద్యార్థులకు పశ్నాపత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, వేసవి  దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్‌శాఖ సహకారంతో కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


డీఈవోగా నారాయణరెడ్డికి బాధ్యతలు

వరంగల్‌ సిటీ, మే 23 : హనుమకొండలోని ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నారాయణరెడ్డికి సిద్దిపేట డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్‌ ఎ.దేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పదో తరగతి పరీక్షల పర్యవేక్షకుడిగా ఉన్న నారాయణరెడ్డి హుటాహుటిన సిద్దిపేటకు వెళ్లి డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత డీఈవో రవికాంతరావు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడంతో నారాయణరెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2022-05-24T05:16:14+05:30 IST