ఉక్రెయిన్‌ ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-27T06:05:08+05:30 IST

ఉక్రెయిన్ విషయంలో ఏ మాత్రం దూకుడు ప్రదర్శించినా ఆయుధాలతో పాటు, సవాలక్ష ఆంక్షలతో కూడా దెబ్బకొడతానంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నారు...

ఉక్రెయిన్‌ ఉద్రిక్తత

ఉక్రెయిన్ విషయంలో ఏ మాత్రం దూకుడు ప్రదర్శించినా ఆయుధాలతో పాటు, సవాలక్ష ఆంక్షలతో కూడా దెబ్బకొడతానంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నారు. పుతిన్ ఉక్రెయిన్‌లోకి చొరబడతారా, అమెరికా హెచ్చరికలను బేఖాతరుచేస్తూ ఓ భారీ యుద్ధానికి సైతం సిద్ధపడతారా? అన్న ప్రశ్నలకు పుతిన్ దగ్గర కూడా సమాధానం లేదని రష్యా రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ వివాదం ఎంతోకాలంగా వేడిగానే ఉంటోంది. ఇప్పుడు ఏకంగా నేడో రేపో రష్యా దురాక్రమణ, అనంతరం పెద్ద యుద్ధం తప్పదన్నట్టుగా దృశ్యం కనిపిస్తోంది. దురాక్రమించాలన్న దురుద్దేశం తనకు లేదని పుతిన్ అంటున్నా, ఆయన క్రిమియా సాహసాన్ని కళ్ళారా చూసిన అమెరికా ఆ మాట నమ్మడం లేదు.


ఇరుపక్షాల మోహరింపు భారీగా ఉంది. లక్షన్నరమంది రష్యన్ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉంటే, అమెరికా పెద్ద ఎత్తున యుద్ధనౌకలను, ఫైటర్ జెట్లను తరలించింది. తన దౌత్యసిబ్బందిని వెనక్కు వచ్చేయమన్నది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున భారత ప్రభుత్వం కూడా తన రాయబార కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో వేరుపడిన ఉక్రెయిన్ ఎప్పటికైనా తనదేననీ, తనతోనే ఉండాలనీ రష్యా కోరుకుంటోంది. అనేక కీలకమైన రక్షణరంగ పరిశ్రమలు, క్షిపణి తయారీ వ్యవస్థలు, అపారఖనిజ సంపదతో వేరుపడిన ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యాకు కీలకం. అది తనపక్షాన ఉంటే రష్యా మరింత బలంగా ఉంటుందని పుతిన్ నమ్మకం. ఉక్రెయిన్ జనాభాలో దాదాపు ఐదోవంతు రష్యన్లే. దాని తూర్పు ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా రష్యాకు దగ్గర. దీని ఆధారంగానే ఉక్రెయిన్ పాలకులపై తిరుగుబాట్లను ఎగదోసేందుకు రష్యా ప్రయత్నిస్తూంటుంది. 2014లో రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడిమీద ప్రజలు తిరగబడి, అధికారంనుంచి దించివేయగానే పుతిన్ క్రిమియాను ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి ఉభయుల మధ్యా దూరం మరింత పెరిగింది. ఉక్రెయిన్ నాటోకు సన్నిహితమై, దానితో భద్రతా ఒప్పందాన్ని చేసుకుంది. తన సరిహద్దు ప్రాంతాల్లో రష్యా కార్యకలాపాలు, సైనిక హత్యలతో ఉక్రెయిన్ ఎప్పుడూ తుళ్ళిపడుతూనే ఉంది. గత ఏడాది ఆరంభంలో కూడా రష్యా నాటో యుద్ధం అంచులవరకూ పోయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ను తనవైపు లాక్కోవాలన్న రష్యా ప్రయత్నం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ మాత్రం నాటోతో నడవాలనీ, చేరిపోవాలనీ కోరుకుంటోంది. యూరోపియన్ యూనియన్ లో చేరికకూ ఉత్సాహపడుతోంది. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోబోమన్న నిర్దిష్ట హామీతోపాటు, ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలకు ఏ ముప్పూ ఉండదన్న హామీ కావాలని రష్యా అడుగుతోంది. 


క్రిమియా విషయంలో పుతిన్ దూకుడును నిలువరించలేకపోయిన నాటో ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో చూస్తూ ఊరుకొనే పరిస్థితి లేదు. ఉభయపక్షాల మధ్యా స్వల్పస్థాయి ఘర్షణ రేగినా ఇంధన సరఫరాలపై దాని ప్రభావం ఉంటుంది. రష్యాపై నాటో ఆంక్షలు విధించడం, ఇందుకు ప్రతిగా యూరప్ కు రష్యా గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటివి సహజ పరిణామాలు. ఇప్పుడు ఘర్షణకు కేంద్రమైన ఉక్రెయిన్ డాన్ బాస్ ప్రాంతంలో అపార చమురు నిల్వలున్న విషయం తెలిసిందే. 2014లో క్రిమియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధనధరలు హెచ్చాయి. ఇక, రష్యా అమెరికా మధ్య ఘర్షణంటూ మొదలైతే, చైనా ఊరుకోదు. దాని వీరంగం తైవాన్ ను భయపెట్టడానికి మాత్రమే పరిమితమవుతుందని చెప్పలేం. భారతదేశం మీద ఈ గొలుసుకట్టు పరిణామాల ప్రభావం తక్కువేమీ ఉండదు. ఉక్రెయిన్ కేంద్రంగా రాజుకున్నవేడిని చల్లార్చడానికి అన్ని పక్షాలకూ ఇంకా అవకాశం ఉన్నది. అసలే కరోనా కష్టాల్లో మునిగివున్న ప్రపంచం, అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే యుద్ధాలను భరించగలిగే స్థితిలో లేదు.

Updated Date - 2022-01-27T06:05:08+05:30 IST