Abn logo
May 28 2020 @ 02:25AM

మళ్ళీ ఉద్రిక్తతలు

చైనాఅధ్యక్షుడు యుద్ధనినాదాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు సిద్ధంకమ్మని సైన్యానికి కర్తవ్యబోధ చేశారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉభయదేశాలూ సైన్యాలను మోహరించిన తరుణంలో, ఆయన భారత్‌ పేరు ఎత్తకున్నా ఆ వ్యాఖ్యలు మనని ఉద్దేశించినవేనని అనుకోవడం సహజం. మూడేళ్ళక్రితం డోక్లామ్‌ గొడవలో ఇరుదేశాలూ యుద్ధం ముంగిట్లో ఉన్నప్పుడు కూడా జిన్‌పింగ్‌ ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఆ మాటల వెనుక లద్దాఖ్‌ ఉన్నదో, హాంకాంగ్‌ ఉన్నదో తెలియదు కానీ, భారత్‌ని ఉలిక్కిపడేట్టు చేశాయి. తన అర్థంలేని నిర్ణయాలతో, అనుచిత వ్యాఖ్యలతో చిచ్చురగల్చే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ భారత్‌–చైనా కలహాన్ని చల్లార్చుతాననీ, సరిహద్దు తగాదాలో మధ్యవర్తిత్వం వహిస్తానని అంటున్నారు. ఒక పక్క చైనాను దుర్భాషలాడుతూ, వారంలోగా దానికి గుణపాఠం చెబుతానని అంటూనే దౌత్యం నెరపుతానని హామీ ఇస్తున్నారు.


సరిహద్దులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. లద్దాఖ్‌లోని మూడునాలుగు లోయల్లోకి చైనా సైన్యం చొరబడి, తిష్టవేసింది. తాత్కాలిక నిర్మాణాలు జోరందుకున్నాయి. వైమానికస్థావరం విస్తరణ, ఎయిర్‌బేస్‌ నిర్మాణానికి సన్నాహాలు సాగుతున్నాయి. చైనా బలగాలను ఎదుర్కొనేందుకు భారత్‌ తన సైన్యాన్నీ, శకటాలను తరలిస్తూనే, చైనా బెదిరింపులకు లొంగవద్దనీ, సరిహద్దుల్లో, మరీ ముఖ్యంగా డీబీవో సెక్టార్‌లో నిర్మాణాలు యథాప్రకారం కొనసాగించాల్సిందేనని నిర్ణయించుకుంది. భారత ఆర్మీచీఫ్‌ నరవాణే లద్దాఖ్‌ పర్యటనలు, ఆర్మీకమాండర్లతో భేటీలు, త్రివిధదళాలతో హోంమంత్రి చర్చలు, డోక్లామ్‌ కాలం నాటి మువ్వురు ముఖ్యులతో ప్రధాని మంతనాలు పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మోదీతో ఇలా దోవల్‌, రావత్‌, జైశంకర్‌లు భేటీ అయ్యారంటే, చైనాను భయాన కాక ముందుగా నయాన దారికి తెచ్చే మార్గాలు వెతకడానికేనని కొందరి నమ్మకం. 


లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం చైనాకు ఆగ్రహం కలిగించినా, ఆ నిర్ణయాధికారం పూర్తిగా మనదే. 370 అధికరణ రద్దుతో లద్దాఖ్‌ విషయంలో మనం బలహీనపడ్డామన్న వాదనలూ లేకపోలేదు. ఇక, మూడున్నర వేల కిలోమీటర్ల వాస్తవాధీనరేఖలో చారిత్రకంగా పోగుబడిన వివాదాలు అనేకం. స్థానికంగా గస్తీ తిరిగే సైనికుల మధ్యా ఘర్షణలు రేగడం, కమాండర్ల స్థాయిలో దూకుడు నిర్ణయాల వల్ల కలహాలు రేగడం జరుగుతున్నదే. ఉత్తరలద్దాఖ్‌లోని పోంగాంగ్‌ సరస్సు ప్రాంతం ఉభయదేశాలకూ రక్షణరీత్యా కీలకమైనది కనుక, నిర్మాణాలు, విస్తరణలకు సంబంధించిన నిర్ణయాలు జరిగినప్పుడు ఇక్కడ ఉద్రిక్తతలు నెలకొంటాయి. దశాబ్దాలుగా ఒక్క బుల్లెట్‌ కూడా పేలకుండా అనతికాలంలోనే సమసిపోయిన వివాదాలు ఉభయదేశాలూ చూశాయి. కానీ, కరోనా విషయంలో అంతర్జాతీయంగా అప్రదిష్టపాలైన చైనా ఆత్మరక్షణ విధానానికి స్వస్తిచెప్పి దూకుడు నిర్ణయాలకు ఉపక్రమించడంతో హాంకాంగ్‌నుంచి లద్దాఖ్‌ వరకూ అనేకం వేడెక్కుతున్నాయి. కరోనా దెబ్బతో యావత్‌ ప్రపంచం ముందు చైనా అప్రదిష్టపాలైంది. ఆర్థికంగా దెబ్బతిన్నది. దాని సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. తయారీ పరిశ్రమలు భారత్‌కు మళ్ళిపోతాయని కూడా అంటున్నారు. అంతర్గతంగా కూడా ప్రజల్లో తీవ్రంగా అప్రదిష్టపాలైన చైనా పాలకులు ఈ నేపథ్యంలో, ఏదో వెలుపలి బూచిని చూపించి ప్రజల దృష్టిని మళ్ళించక తప్పదు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా మనం చైనాకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు సైతం దాని ఆగ్రహానికి కారణం. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు సంబంధించిన నియమ నిబంధనలను కేవలం దానిని లక్ష్యంగా చేసుకొని మార్చడం, కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ తీర్మానానికి అనుకూలంగా ఓటేయ్యడం, తైవాన్‌ అధ్యక్షురాలి ప్రమాణస్వీకారోత్సవంలో భారత ఎంపీలు పాలుపంచుకోవడం వంటివి చైనాపై ఒత్తిడిపెంచేవే. ఇందుకు ప్రతిగా నేపాల్‌లో ఓలి ప్రభుత్వంతో భారత్‌ను ఇరుకునపెట్టేందుకు అది ఏవో ప్రయత్నాలు చేస్తున్నది. కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌–పాకిస్థాన్‌ మధ్య దూతగా పనిచేస్తానని గతంలో ట్రంప్‌ పలుమార్లు ముందుకొచ్చినా భారత్‌ అంగీకరించలేదు. పాకిస్థాన్‌ ఆయన్ని బరిలోకి లాగేందుకు ప్రయత్నించినా ఇది ఉభయదేశాల మధ్య వ్యవహారమంటూ భారత్‌ పడనీయలేదు. ఇప్పుడు చైనాతో గొడవను సైతం ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం. చైనా సైతం ఈ వివాదాన్ని క్రమంగా ఉపశమింపచేసే ఉద్దేశంలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నది. ఆర్థిక, అంతర్జాతీయ వివాదాలను అటుంచితే, సరిహద్దు తగాదాలను చిలికిచిలికి గాలివానగా మార్చడం ఇద్దరికీ శ్రేయస్కరం కాదు.