క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్ట్‌ కూల్చివేతపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-08-04T04:16:52+05:30 IST

సంగారెడ్డిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్ట్‌ కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొన్నది.

క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్ట్‌ కూల్చివేతపై  ఉద్రిక్తత
కూల్చేసిన కోర్ట్‌ గేటు వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారులు

కలెక్టర్‌ క్యాంపు ఆఫీస్‌ ఎదుట క్రీడాకారుల ఆందోళన

ఇన్‌చార్జి డీవైఎ్‌సవో జావిద్‌అలీపై కఠిన చర్యలకు డిమాండ్‌

అవినీతి అధికారికి జిల్లా అధికారి బాధ్యతలా?

మండిపడిన క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు

అధికార దుర్వినియోగంపై ఆగ్రహం


సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 3 : సంగారెడ్డిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్ట్‌ కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొన్నది. జిల్లా యువజన క్రీడల శాఖ ఇన్‌చార్జి అధికారి (డీవైఎ్‌సవో) ఎండి జావిద్‌అలీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్రికెట్‌ ప్రాక్టీస్‌ మైదానంలో ఫెన్సింగ్‌, ప్రవేశ ద్వారం, నెట్‌ ఇతర పరికరాలను ఎక్స్‌కవేటర్‌ సహాయంతో ధ్వంసం చేయడంపై క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, క్రికెట్‌ క్రీడాభిమానులు మంగళవారం మైదానంలో ఆందోళనకు దిగారు. కోర్ట్‌ వద్ద బైఠాయించి డీవైఎ్‌సవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం చేయాలని పెద్దఎత్తున క్రీడాకారులు కలెక్టర్‌ హన్మంతరావు క్యాంపు ఆఫీ్‌సకు వెళ్లి ఆందోళన చేశారు. డీవైఎ్‌సవోను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రమేశ్‌ అక్కడికి చేరుకుని క్రీడాకారులను నిలువరింపజేశారు. అనంతరం అక్కడి నుంచి సామూహికంగా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎ.రాజేందర్‌రెడ్డి, సీనియర్‌ క్రికెటర్‌ మధుసూదన్‌రెడ్డి, బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ లాభాపేక్ష కోసం క్రికెట్‌ కోచ్‌ను ఏర్పాటు చేసి క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేయాలనే దుర్బుద్ధితో ఎలాంటి సమాచారం లేకుండా కోర్ట్‌ను కూల్చేశారని ఆరోపించారు. 25 సంవత్సరాలుగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. పరిశ్రమల శాఖలో అవినీతి ఆరోపణలపై సస్పెండైన అధికారికి ఇన్‌చార్జి డీవైఎ్‌సవో బాధ్యతలు కట్టబెట్టడం ఉన్నతాధికారుల అవగాహనా రాహిత్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయాలకు పాల్పడుతూ మైదానంలో జరిగే ప్రతి ఈవెంట్‌కి డబ్బులు వసూలు చేస్తున్నారని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే ఇన్‌చార్జి డీవైఎ్‌సవోగా కొనసాగుతున్న ఎండి జావెద్‌అలీపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను జిల్లా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున క్రీడాకారులతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా వెంటనే కూల్చేసిన క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్ట్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ శ్రీనాథ్‌రెడ్డి, మౌలాలీ, క్రీడాకారులు, సీనియర్‌ ప్లేయర్లు, వివిధ క్రీడా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T04:16:52+05:30 IST