వజ్జిరెడ్డిపాలెంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-21T05:40:06+05:30 IST

మండలంలోని వజ్జిరెడ్డిపాలెంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులక్రితం గ్రామంలోని ప్రధాన రోడ్డుపై తెలుగుదేశం పార్టీ వర్గీయులకు చెందిన బంకును తొలగించేందుకు కొత్తపట్నం పోలీసుల సహాయంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రయత్నించటంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ నేపథ్యంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించారు. ఇలా నాయకులు అందరూ స్టేషన్‌లో ఉండగా అధికారులు, పోలీసులు వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు.

వజ్జిరెడ్డిపాలెంలో ఉద్రిక్తత
వజ్జిరెడ్డిపాలెంలో రాస్తోరోకో చేస్తున్న గ్రామస్థులు

అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

పోలీసులతో వాగ్వాదం.. వాహనం నిలిపివేత

ఆర్‌అండ్‌బీ అధికారిని చుట్టుముట్టిన గ్రామస్థులు

బంకును తొలగించిన స్థానంలో కొత్తది తెచ్చిపెట్టిన వైనం

కొత్తపట్నం, అక్టోబర్‌ 20 : మండలంలోని వజ్జిరెడ్డిపాలెంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులక్రితం గ్రామంలోని ప్రధాన రోడ్డుపై తెలుగుదేశం పార్టీ వర్గీయులకు చెందిన బంకును తొలగించేందుకు కొత్తపట్నం పోలీసుల సహాయంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రయత్నించటంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ నేపథ్యంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారిని స్టేషన్‌కు తరలించారు. ఇలా నాయకులు అందరూ స్టేషన్‌లో ఉండగా అధికారులు, పోలీసులు వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు. ఉదయం ఎక్స్‌కవేటర్‌ సహాయంతో బంకును కూల్చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు భారీగా అక్కడకు చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్న అన్ని దుకాణాలను తొలగించకుండా ఒక్క టీడీపీ వారినే టార్గెట్‌ చేసి తొలగించారంటూ పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలగించిన బంకు చెక్కలను, ఇతర వస్తువులను రోడ్డుకు అడ్డంగా వేసి రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళనకు సీపీఎం నాయకులు కూడా మద్దతు పలికారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి.  

ఏఈ, ఎస్‌ఐపై ఆగ్రహం

ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీకాంత్‌, కొత్తపట్నం ఎస్‌ఐ రామకృష్ణ రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి తమకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామస్థులు మొదట ఏఈని నిర్బంధించారు. అతనిపై దాడికి ప్రయత్నించటంతో పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసు వాహనంలో దాక్కున్నారు. ఏఈ కారు టైర్లలో గాలి తీసేశారు. దీంతో గ్రామస్థులు పోలీసు వాహనాన్ని కూడా చుట్టుముట్టారు. ఎస్‌ఐ రామకృష్ణపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు ఒంగోలు టూటౌన్‌ సీఐ రాఘవరావుకు సమాచారమిచ్చారు. దీంతో ఆయన హుటాహుటిన కొత్తపట్నం వచ్చారు. స్టేషన్‌లో ఉన్న టీడీపీ నాయకులు తెలుగురైతు నాయకుడు బలగాని వెంకటనారాయణ, మండల అధ్యక్షుడు శ్రీనివాసరావును తీసుకుని వజ్జిరెడ్డిపాలెం చేరారు. సీఐ సమక్షంలో కూడా గ్రామస్థులు అధికారులపై విరుచుకుపడ్డారు. రెండురోజుల క్రితం ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్న అన్ని దుకాణాలను తొలగిస్తామని చెప్పి వెళ్లారని, ఈరోజు తెలియకుండా వచ్చి ఈ ఒక్క బంకునే తొలగించారంటూ సీఐతో చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఒక్క బంకునే ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో సీఐ వారితో చర్చలు జరిపారు. చివరకు బంకు పెట్టేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో గ్రామస్థులు అధికారులు తొలగించిన స్థానంలో కొత్త బంకును తెచ్చి ఏర్పాటుచేయడంతో పరిస్థితులు చల్లబడ్డాయి. పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకుని తిరుగుముఖం పట్టారు. 


Updated Date - 2021-10-21T05:40:06+05:30 IST