పురంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-29T05:21:39+05:30 IST

ప్రశాంతమైన హిందూపురంలో ఇటీవల రాజకీయ వైషమ్యాలతో గందరగోళం ఏర్పడుతోంది.

పురంలో ఉద్రిక్తత
టీడీపీ నాయకులపైకి దూసుకెళ్తున్న వైసీపీ నాయకులు

- టీడీపీ నేతలను చుట్టుముట్టిన వైసీపీ వర్గీయులు

- ప్రెస్‌క్లబ్‌ ఎదుట వైసీపీ కవ్వింపు చర్యలు

   హిందూపురం, సెప్టెంబరు 28: ప్రశాంతమైన హిందూపురంలో ఇటీవల రాజకీయ వైషమ్యాలతో గందరగోళం ఏర్పడుతోంది. తాజాగా బుధవారం టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందూపురం ప్రెస్‌క్లబ్‌వద్ద చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.  ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ మంగళవారం చిలమత్తూరులో ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన విమర్శలను ఖండించేందుకు బుధవారం తెలుగుదేశం నాయకులు హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు సమావేశం ముగించుకుని బయటికి వస్తున్న సందర్భంలో వైసీపీ నాయకులు కూడా విలేకరుల సమావేశం పేరుతో అదే సమయంలో ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చారు. టీడీపీ నాయకులు బయటకు వస్తుండగా వైసీపీ నాయకుడు గోపీకృష్ణతో పాటు, మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, ఇతర నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.  చంద్రబాబు, బాలకృష్ణలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఇంకాస్త ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులను చుట్టుముట్టారు. ఈ సందర్భంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి, దళిత నాయకురాలు రామాంజినమ్మను తోసేసే ప్రయత్నం కూడా చేశారు. వైసీపీ నాయకులను టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, నాయకులు దేమకేతేపల్లి అంజినప్ప, బేకరి గంగాధర్‌, రవీంద్రనాయుడులు దీటుగా ఎదుర్కొన్నారు. ఇరువర్గాలు వాగ్వాదం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న సీఐ ఇస్మాయిల్‌ సిబ్బందితో వెళ్లారు. టీడీపీ నాయకులను బయటకు పంపించేశారు. అనంతరం టీడీపీ నాయకులు ప్రెస్‌క్లబ్‌ బయట రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 

ఆసుపత్రిలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి : ప్రెస్‌క్లబ్‌ వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ రాష్ట్రకార్యదర్శి రామాంజినమ్మ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్సలు పొందుతున్న ఆమెను టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మినారాయణ, నాగరాజు, అంజినప్ప, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన కిష్టప్ప,  చంద్రమోహన, విజయలక్ష్మి, మోద శివ తదితరులు పరామర్శించారు. అంతకుముందు తనను కులం పేరుతో దూషించి అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రామాంజినమ్మ వనటౌన స్టేషనకు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారన్నారు. వైసీపీ నాయకులు గోపీకృష్ణ, లోకేష్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, మల్లికాబాను, నాగరాజుతోపాటు మరికొంతమందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట టీడీపీ నాయకులు శ్రీనివాసులు, అభి, జయచంద్ర, మంజునాథ్‌, ప్రసాద్‌, మురళి, చంద్రమోహన, విజయలక్ష్మీ, లక్ష్మీ, నరసింహప్ప, ఈశ్వర్‌ తదితరులు ఉన్నారు. 


వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి : బీకే 


 వైసీపీ నేతలకు అహంకారం పెరిగిపోతోందని, ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. బుధవారం హిందూపురం ప్రెస్‌క్లబ్‌వద్ద టీడీపీ నాయకులపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొనడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. అధికారపార్టీలో అందరూ గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళిత వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మపై వైసీపీ గూండాల దాడి హేయమైనచర్య అన్నారు. 


Updated Date - 2022-09-29T05:21:39+05:30 IST