Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరులో ఉద్రిక్తత.. లోకేష్‌తోపాటు టీడీపీ నేతల అరెస్టు

గుంటూరు: ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యుల పరామర్శ సందర్భంగా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్టు చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధూలిపాళ నరేంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్టు చేశారు. మరికొందరు టీడీపీ నేతలను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి అరెస్టు చేశారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించానని, వాళ్లతో మాట్లాడానన్నారు. వాళ్లు ఏమన్నారంటే.. ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలు  అవసరం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే వైసీపీ రౌడీలు వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారంటే.. గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Advertisement
Advertisement