Abn logo
Apr 21 2021 @ 00:54AM

టెం‘డర్‌’

ఆర్‌అండ్‌బీ పనులంటేనే భయపడుతున్న కాంట్రాక్టర్లు

మరమ్మతుల కోసం పిలిచిన టెండర్లకు స్పందన శూన్యం

పాత బిల్లులకే దిక్కులేదు.. కొత్త పనులా అంటూ దూరం

చేసేది లేక రెండోసారి ఆహ్వానించేందుకు యంత్రాంగం సన్నద్ధం 

ప్రభుత్వం టెండర్లను పిలుస్తోంది అంటేనే కాంట్రాక్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం. అవి కూడా తక్కువ మొత్తాలవి అయితే ఆశావహుల జాబితా చాంతాడంత ఉండేది. వారివారి స్థాయిలను బట్టి పైరవీలు, బెదిరింపులు షరామామూలే. ఇదంతా గతం. ప్రస్తుతం కథ మారింది. ఆర్‌అండ్‌బీ టెండర్లంటేనే కాంట్రాక్టర్లు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. పోటీ సంగతి దేవుడెరుగు కనీసం బిడ్‌ వేయడానికి ఒకరిద్దరు కూడా ముందుకురాని విచిత్ర పరిస్థితి నెలకొంది. రహదారుల మరమ్మతుల కోసం ఇటీవలే ఆర్‌అండ్‌బీ శాఖ ఆన్‌లైన్‌ టెండర్లను పిలించింది. ఈనెల 13తో గడువు ముగిసింది. దాదాపు 60పనులకు బిడ్లను ఆహ్వానిస్తే ఒక్కటంటే ఒక్కటే దాఖలైంది. సాంకేతికంగా అది కూడా మనుగడలో లేనట్లే. అంటే స్పందన శూన్యం. ఎటూ పాలుపోని యంత్రాంగం రెండో దఫా మళ్లీ టెండర్లు పిలిచేందుకు సమాయత్తమవుతోంది.


ఒంగోలు (జడ్పీ), ఏప్రిల్‌ 16 : ఆర్‌అండ్‌బీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు. కొత్తరోడ్లు, కొత్తపనులు పక్కన పెడితే కనీసం మరమ్మతులు కూడా చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఇందుకు పాతబిల్లులు ఇవ్వకపోవడం ఒక కారణమైతే, అసలు పనులు చేసే పరిస్థితి లేకపోవడం కూడా మరో కారణం. ఏడాదిన్నరగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోక అస్తవ్యస్తంగా తయారైన జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారులకు మరమ్మతుల నిమిత్తం రూ.106.87కోట్లకు పరిపాలనపరమైన అనుమతులను గత నెలలో ప్రభుత్వం ఇచ్చింది. మరమ్మతుల జాబితాలో ఎండీఆర్‌( మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌)లతో పాటు స్టేట్‌ హైవేస్‌ కూడా ఉన్నాయి. రాష్ట్ర రహదారులకు సంబంధించి రూ.10.87కోట్లకు ప్రభుత్వం ఆమోదముద్ర కూడా వేసింది. జిల్లాలోని 362 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు అవసరమని ఆర్‌అండ్‌బీ తేల్చింది. వాటిని దాదాపు 67 పనులుగా విభజింజి టెండర్లకు వెళ్లింది. వాటికి ప్రస్తుతం స్పందన కరువైంది.


పాత బిల్లులకే మోక్షం లేదు.. మళ్లీ కొత్తవా...?

గతంలో ఆర్‌అండ్‌బీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.100కోట్లకుపైన ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. గతంలో పనులు చేసిన వారిలో అత్యధికశాతం మంది చిన్న కాంట్రాక్టర్లే ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రకరకాల కారణాలతో వారి బిల్లులను నిలుపుదల చేసింది. సొంత డబ్బులతో పనులు చేసిన వారు కొందరైతే, వడ్డీలకు తెచ్చి మరీ ఖర్చుచేసిన వారు మరి కొందరున్నారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని కూడా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చేసేది లేక బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం కాంట్రాక్టర్ల వంతైంది. అనుభవాలు ఇలా ఉండడంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం కొత్త వారైనా వస్తారా అంటే వీరి పరిస్థితిని చూసిన వారికి కూడా వణుకు ప్రారంభమైంది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే చందంగా మొత్తానికే దూరంగా ఉండిపోతున్నారు.


రెండోసారి టెండర్లకు సమాయత్తమవుతోన్న యంత్రాంగం

టెండర్లకు గడువు ఈనెల 13తో ముగిసింది. స్పందన రాకపోవడంతో రెండోసారి టెండర్లను పిలవడానికి ఆర్‌అండ్‌బీ సిద్ధమవుతోంది. నిర్ణీత వ్యవధిలో మరమ్మతులను పూర్తిచేయాలనే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు ఒకవైపు, టెండర్లకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు మరోవైపు.. వీటి మధ్య అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్కలా’ తయారైంది. నిబంధనల ప్రకారం పనులను నామినేషన్‌ ప్రాతిపదికన ఇవ్వడానికి వీల్లేదు. టెండర్ల విధానం ద్వారానే కేటాయించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యం జరగదని, టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకోవాలని యంత్రాంగం కోరుతోంది.


Advertisement
Advertisement
Advertisement