నేటి నుంచి ‘పది’ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-23T06:38:33+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభకానున్నాయి. అందుకు సంబంధిం చి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేటి నుంచి ‘పది’ పరీక్షలు
నల్లగొండలోని ఓ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో

జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాలు

హాజరుకానున్న 19,918 మంది విద్యార్థులు 

నల్లగొండ, మే 22: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభకానున్నాయి. అందుకు సంబంధిం చి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నా యి. జిల్లా వ్యాప్తంగా 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 19,918 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా  ఆర్టీసీ బస్సులు నడపనున్నా రు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు వైద్య సిబ్బందిని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్య లు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తుతో పాటు 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. పరీక్ష సమయంలో జీరాక్స్‌ సెంటర్ల్‌ను మూసివేయించనున్నారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45గంటల వరకు కొనసాగుతాయి. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. ఒక్కో బృందంలో ఒక ఎంఈతో పాటు రెవెన్యూ సూపరింటెండెంట్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉంటారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు  ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నపత్రాలు తెరిచేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. అన్ని మండలాల్లో ఎంఈవోల ఫోన్‌ నెంబర్లను హెల్ప్‌లైన్‌ నెంబర్లుగా ఏర్పాటుచేశా రు. జిల్లాస్థాయిలో డీఈవో నెంబరు 9849909123 సమాచారం అందజేయవచ్చు. అదేవిధంగా పరీక్షల సహాయ కమిషనర్‌ ఫోన్‌ నెంబరు 7989819053ను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 107 పరీక్ష కేంద్రాల్లో 107 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 107మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 1,110 మంది ఇన్విజిలేటర్లు, 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటుచేశారు.

విద్యార్థులు, సిబ్బంది ఇవి పాటించాలి..

పరీక్ష సిబ్బంది తప్పనిసరిగా ఫొటో ఐడీకార్డును ధరించాలి.

విద్యార్థులు హాల్‌టికెట్‌ను తీసుకుని పరీక్షకు హాజరుకావాలి.

జవాబు పత్రంలోని ప్రతీ పేజీపై హాల్‌టికెట్‌ నంబరు తప్పనిసరిగా రాయాలి. 

విద్యార్థులు, సిబ్బంది సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.

పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులు, సిబ్బంది పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు.

పరీక్షలు ఇలా..

పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు కొనసాగనున్నాయి. జూన్‌1న ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు మాత్రమే ఉండనుంది.

Updated Date - 2022-05-23T06:38:33+05:30 IST