ఠారెత్తిస్తున్న భానుడు

ABN , First Publish Date - 2020-05-25T11:08:06+05:30 IST

జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రతాపానికి జనం ఉడికిపోతున్నారు

ఠారెత్తిస్తున్న భానుడు

మూడు రోజులుగా మంటలు

ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో నమోదు

ఉడికిపోతున్న ప్రజలు 

రోహిణి రాకతో మరింత సెగలు

నెలాఖరు వరకూ ఇలాంటి పరిస్థితే


మలమల మాడ్చేస్తున్న ఎండ! మాడు పగిలే వేడి! సెగలు కక్కుతున్న సూర్యుడు రోజురోజుకూ చెలరేగిపోతున్నాడు. మరింత ఉగ్రరూపం దాల్చుతూ నేలపై నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మంట పుట్టిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలోనే జిల్లాలో శుక్ర, శని, ఆది వరుసగా మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


అగ్నికి ఆజ్యంలా భానుడి ప్రతాపానికి వడగాడ్పులు తోడయ్యాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 47 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఆదివారం రోహిణికార్తె రావడంతో మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. 


ఒంగోలు, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రతాపానికి జనం ఉడికిపోతున్నారు.  వారంరోజుల నుంచే ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అత్యధికంగా జిల్లాలో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా టంగుటూరులో 47.43 డిగ్రీల ఎండ కాచింది. శనివారం కురిచేడులో 47.33, ఆదివారం దోర్నాలలో 45.22 డిగ్రీలు ఇలా వరుసగా మూడు రోజులు మన జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఆదివారం రోహిణికార్తె ప్రవేశించింది. రోహిణిలో రోళ్లుపగిలే ఎండలు కాస్తాయయన్నది నానుడి. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 42 నుంచి 47 డిగ్రీల ఉష్ణోత్రలు నమోదవుతున్నాయి. రోహిణిలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. 


మండిన పశ్చిమ

 జిల్లాలో ఆదివారం ఎండల తీవ్రత అధికంగానే ఉంది.  శనివారం వరకూ తూర్పుప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా ఆదివారం పశ్చిమప్రాంతం మండింది. ఉదయం పదకొండు గంటలకల్లా అత్యధిక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరగా ఆతర్వాత మరింతగా పెరిగాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రంలో గరిష్ఠంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో 42.21 డిగ్రీల నమోదుకాగా మన జిల్లాలోని సి.ఎ్‌స.పురం 41.17 డిగ్రీలతో మూడో స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజువారీ నమోదు చేసే 855 కేంద్రాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 50 కేంద్రాల్లో 19 మన జిల్లాలోనే ఉన్నాయి. అలాగే మద్యాహ్నం 12గంటలకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన తొలి పదింటిలో ఐదు జిల్లాలోనే ఉన్నాయి. 


ఒంటి గంట సమయానికి నమోదైన ఉష్ణోగ్రతల్లో తొలి నాలుగు కేంద్రాలు జిల్లాలోనివే. కనిగిరి మండలం నందన మారెళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.81 డిగ్రీలు నమోదుకాగా తరువాత వరుసగా దోర్నాలలో 44.39, చీమకుర్తిలో 44.12, కొనకమిట్లలో 44.01 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకు కూడా వరుసగా తొలి మూడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన కేంద్రాలు జిల్లాలోనే ఉన్నాయి. 45.22 డిగ్రీలతో దోర్నాల ప్రథమ స్థానంలో ఉంది. కె.కె.మిట్లలో 45.19, మర్రిపూడిలో 44.48 డిగ్రీలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 3గంటలకు కూడా రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత దోర్నాలలోనే నమోదైంది.


ఆ సమయంలో అక్కడ 45.05 డిగ్రీలు నమోదు కాగా మూడో స్థానంలో ఉన్న కనిగిరిలో 44.86 డిగ్రీలుగా ఉంది. అలాగే 5గంటల ప్రాంతంలో చూస్తే 44.65 డిగ్రీలతో దోర్నాల రెండో స్థానంలో ఉండగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 50స్థానాల్లో 11జిల్లాలోనే ఉన్నాయి. ఇలా అధిక ఉష్ణోగ్రతలే కాక అంతకుమించి జిల్లాలో  వేడిగాలులు, ఉక్కపోత మరింత ఎక్కువవడంతో ప్రజానీకం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులు ఉండొచ్చని తెలుస్తుండగా రోహిణికార్తె ప్రభావంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


వడదెబ్బకు  వృద్ధురాలి మృతి 

తాళ్లూరు : మండలంలోని రమణాలవారిపాలెం గ్రామానికి చెందిన  వృద్ధురాలు షేక్‌ మీరాబీ (77) వడదెబ్బకు మృతి చెందింది. గత రెండు రోజులుగా పెరిగిన ఎండ తీవ్రతకు ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-05-25T11:08:06+05:30 IST