తెలుగు వర్సిటీ వచ్చేనా?

ABN , First Publish Date - 2020-10-30T06:39:01+05:30 IST

తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి వస్తుందా రాదా అనే చర్చ ఈమధ్య జరుగుతోంది.

తెలుగు వర్సిటీ వచ్చేనా?

  • హామీలే కానీ పట్టించుకునేవారేరీ.. 
  • బొమ్మూరు క్యాంపస్‌లో అన్నీ కష్టాలే
  • డీనూ లేరు.. స్టాపూ లేరు 
  • 11 మంది సిబ్బందితో అధ్వానంగా తెలుగువైభవం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి వస్తుందా రాదా అనే చర్చ ఈమధ్య జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. తర్వాత వైస్‌ చాన్సలర్‌ను నియమించింది. ఇంతలో ప్రభుత్వ మారడంతో వీసీ దుర్గాభవానికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో ఆమె రాజీనామా చేశారు. తర్వాత ఇంతవరకూ వీసీ నియామకం జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువిశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది. విభజన చట్టంలో అది 10వ షెడ్యూల్‌లో ఉంది. కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విశ్వవిద్యాలయం పరిధిలో రాజమహేంద్రవరంలోని బొమ్మూరు తెలుగుసాహిత్యపీఠం, శ్రీశైలంలోని పీఠం, కూచిపూడిలో మరో పీఠం ఉండేవి. ఇప్పటికే ఇవి హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉన్నాయి. 2015 ప్రాంతంలో ఇక్కడి సిబ్బందికి జీతాలివ్వకపోవడంతో కోర్టుకెళ్లారు. ఈ మూడు క్యాంపస్‌లలోని ఉద్యోగుల జీతభత్యాలు చూడడానికి, ఇక్కడ పనులు చూడడానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఆఫీసర్‌ ఇన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)ని నియమించారు. ఇప్పటికి ఇద్దరు ముగ్గురు మారారు. 1987లో ఎన్టీఆర్‌ తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ప్రాణం పోయాలనే ఆలోచనతో బొమ్మూరులో 45 ఎకరాల స్థలంలో తెలుగువిశ్వవిద్యాలయం సాహిత్యపీఠం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి చాలాకాలం ఇది ఓ వెలుగు వెలిగింది.  తెలుగు రాష్ర్టాలలోని ప్రఖ్యాత సాహిత్యకారులు, కవులు, రచయితలు అందరూ ఇక్కడకు వచ్చేవారు. చర్చలు జరిగేవి. పరిశోధనలు జరిగేవి. ఇక్కడ సాహిత్య సభకు రావడం అంటే చాలా గొప్పగా ఫీలవయ్యేవారు. సుమారు 650మంది విద్యార్ధులు ఇక్కడ నుంచి ఎం.ఎ పట్టా పొందారు. 250 మంది పీహెచ్‌డి చేశారు. 400 మంది ఎంఫిల్‌ చేశారు. బేతవోలు రామబ్రహ్మం, రమణయ్య, ఎండ్లూరి సుధాకర్‌ వంటి వారెందరూ పీఠాధిపతులుగా పనిచేశారు. కానీ తర్వాత క్రమంగా దీనిపై శీతకన్ను పడింది. రాష్ట్ర విభజనతో మొత్తం దెబ్బతింది. 45 ఎకరాల భూమిలోని 10ఎకరాలు నేక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తీసేసుకున్నారు. మరో 15 ఎకరాలను తీసుకుని ఇసుక స్టాక్‌ పాయింట్‌ పెట్టారు. మిగతా భూమిని కూడా ఇళ్ల స్థలాలకు తీసుకోవడం కోసం ప్రయత్నించినా ప్రజల నిరసన వెల్లువెత్తడంతో ఆగింది. కానీ ఇక్కడ విశాలమైన అడ్మిస్ర్టేవిట్‌ భవనం, గెస్ట్‌హౌస్‌,  హాస్టల్‌,  క్యాంటీన్‌, క్వార్టర్లు ఉన్నాయి. ఒకప్పుడు ఎంతు వైభంగా సాహిత్య పఠనం, సభలు, జానపదాల వెలిగిన ఈ పీఠానికి ప్రస్తుతం పీఠాధిపతి కూడా లేరు. తెలుగుదేశం వర్సిటీ ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-10-30T06:39:01+05:30 IST