తెలుగు భాషకు పెనుముప్పు

ABN , First Publish Date - 2021-08-29T07:27:19+05:30 IST

తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులంతా ఉద్యమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ...

తెలుగు భాషకు పెనుముప్పు

  • మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.. డిగ్రీ వరకు తెలుగులోనే చదివాను 
  • భాషను కాపాడే బాధ్యత మీడియాదే 
  • సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రమణ వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులంతా ఉద్యమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు మాధ్యమంలో చదివితే పుట్టగతులుండవనే అపోహను తొలగించాలన్నారు. గిడుగు రామమూర్తి 158వ జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, నార్వేకు చెందిన ‘వీధి అరుగు’, మరో 70 తెలుగు సంస్థలతో కలిసి శనివారం వర్చువల్‌గా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. భాషను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన సాగితే కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని, ఆంగ్లం కోసం తెలుగును విస్మరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంగ్లీషు అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైంది. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నాను. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. విద్యాబోధన వ్యవహారికంలో సాగడం నాకెంతో ఉపయోగపడింది’’ అని జస్టిస్‌ రమణ వివరించారు. తన చదువు గ్రాంథికంలోనే కొనసాగి ఉంటే జీవితంలో పొన్నవరం దాటి ఉండేవాడిని కాదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలుచుకుంటూ ప్రపంచ భాషల్లో మంచిని సమ్మిళితం చేసుకుంటూ సుసంపన్నం చేసుకోవాలన్నారు.


సంకెళ్లు తెంచిన గిడుగు

సమాజం మార్పు కోరుతున్నప్పుడు తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే భాషకూ, సంస్కృతికీ తిప్పలు తప్పవని జస్టిస్‌ రమణ హెచ్చరించారు. సంక్లిష్ట రచనా ప్రక్రియల నుంచి సరళమైన ప్రక్రియలకు సాగిన ప్రస్థానంలో ముందుచూపుతో తగిన మార్పులతో ప్రగతిశీలంగా భాషను మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామమూర్తి అగ్రగణ్యులని కొనియాడారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావుతో కలిసి వారు తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారని చెప్పారు.


ఆ ఘనత ఎన్టీఆర్‌దే 

సరళమైన, సామాన్యుడి భాషలో, అద్భుతమైన ఉచ్ఛారణతో ఊరూరా తిరిగి అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన నందమూరి తారకరామారావు విజయంలో ఆయన వాక్చాతుర్యం కీలక పాత్ర పోషించిందని ఆయన అభిప్రాయపడ్డారు. 1980ల వరకు రాష్ట్రం పొలిమేరలు దాటితే తెలుగువారిని మదరాసీలుగా జమ కట్టేవారని, కానీ తెలుగు ఆత్మగౌరవానికి, భాషకు, సంస్కృతికి ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రాధాన్యం వల్లే తెలుగు జాతికి ఉన్న ప్రత్యేకతను ప్రపంచం గుర్తించడం ఆరంభించిందన్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో కూడా తెలుగు చదివే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోయారని మాజీమంత్రి మండలి బుద్దప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో ప్రాచీన భాషా కేంద్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలుగులో మాట్లాడకపోతే మనవారిని మనమే ఈసడించుకోవాలని, ఉగ్రనరసింహుల్లా వ్యవహరించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు అన్నారు. కొలకలూరి ఇనాక్‌, గిడుగు స్నేహలత, పెట్లూరు విక్రమ్‌, తరిగోపుల వెంకట్‌ పాల్గొన్నారు. 


తెలుగు పరిస్థితి దయనీయం 

భాషను వధించడంలో సామాజిక మాధ్యమాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయని, సినిమా రంగంలో కూడా నేడు తెలుగు పరిస్థితి దయనీయంగా మారిందని జస్టిస్‌ రమణ విమర్శించారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లి్‌షలో సబ్‌ టైటిల్స్‌ చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. తెలుగును కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై ఉందని జస్టిస్‌ రమణ చెప్పారు.

Updated Date - 2021-08-29T07:27:19+05:30 IST