పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

ABN , First Publish Date - 2022-05-24T06:29:35+05:30 IST

పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది రైతులపై సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముచ్చటిస్తున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 రైతు రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి   

మేళ్లచెర్వు, మే 23 : పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది రైతులపై సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూడవ రోజు రైతు రచ్చబండ, రైతుభరోసా యాత్రలో  భాగంగా సోమవారం మండలంలోని కందిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, పంజాబ్‌లో మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది గూట్లో రాయి తీయలేనివాడు, ఏట్లో రాయి తీసిన చందమని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా ఇచ్చే అవకాశం రాష్ట్రంలో లేదని అన్నారు. పంటల బీమా పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రద్దు చేసిందన్నారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 24 వరకు హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లోని 316 గ్రామాలు, మూడు మునిసిపాలిటీల్లో రోజుకు ఎనిమిది గ్రామాల చొప్పున యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ఉత్తమన్న రైతుభరోసా యాత్రగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. రైతురచ్చబండలో భాగంగా నల్లబండగూడెం, మంగల్‌కుంటతండా, కందిబండ, హేమ్లాతండా, కప్పలకుంటతండా, రామాపురం, యతిరాజపురం తండా, రామాంజనేయుల తండాల్లో ఆయన పర్యటించారు. అదేవిధంగా కందిబండ, హేమ్లాతండాలో పంపిణీ చేయని డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడిచినా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం, గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కాకునూరి భాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గాయం మోహన్‌రెడ్డి, కొట్టె సైదేశ్వరరావు, గోవిందరెడ్డి, ఎంపీటీసీ బండారుపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:29:35+05:30 IST