కేసీఆర్‌.. అప్పుడప్పుడూ నిజాలు చెప్పండి!

ABN , First Publish Date - 2022-06-03T08:48:42+05:30 IST

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు.

కేసీఆర్‌.. అప్పుడప్పుడూ నిజాలు చెప్పండి!

తెలంగాణపై సవతి ప్రేమ చూపలేదు

రాష్ట్రానికి రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చాం

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

రాగానే విమోచన దినోత్సవం..

ఢిల్లీలో ‘తెలంగాణ అవతరణ’ వేడుకల్లో 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవానికీ 

సహకరించడం లేదని విమర్శ

ప్రధాని రోజుకు 18 గంటలు పనిచేస్తే..

కేసీఆర్‌ నెలలో 18 గంటలు పనిచేయరు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తామెన్నడూ సవతి తల్లి ప్రేమను చూపలేదన్నారు. రాష్ట్రానికి రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చామని, తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సూచించారు. సీఎం కేసీఆర్‌ నిజాలు చెప్పాలన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలంటూ తామెన్నడూ వివక్ష చూపలేదని చెప్పారు. ఏ రాష్ట్రం పట్లా తాము సవతి తల్లి ప్రేమ చూపలేదన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా ఒకేలా గౌరవిస్తామని తెలిపారు. ప్రతి రాష్ట్ర అఽభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతామని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణకు రూ.2,52,202 కోట్ల నిధులు ఖర్చు చేశాం. ఎలా అబద్ధాలు చెబుతారు? నా దగ్గర ప్రతి పైసాకు లెక్క ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ నిధులు రూ.3.5 లక్షల కోట్లకు చేరేవి. కానీ, సహకరించలేదు’’ అని షా చెప్పారు. ఆయా పనులు, పథకాల కోసం రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలను వివరించారు. వెనకబడిన జిల్లాలకు రూ.1800 కోట్లు, ముద్ర రుణాల కోసం రూ.43 వేల కోట్లు, అమృత్‌ పథకానికి రూ.8 వేల కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.31200 కోట్లు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.8 వేల కోట్లు, సర్వశిక్ష అభియాన్‌కు రూ.1300 కోట్లు.. ఇలా వివరిస్తూ పోతే వచ్చే ఎన్నికల కౌంటింగ్‌ వరకూ కొనసాగుతుందని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రికి నాది ఒక్కటే విజ్ఞప్తి.. మీరు తెలంగాణ ప్రజలకు కాస్త నిజాలు చెప్పండి. ప్రతిసారీ అక్కర్లేదు కానీ, కొన్నిసార్లయినా నిజాలు చెప్పండి’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం దేశమంతటా బాగా జరుగుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సహకారం అందించడం లేదన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం దేశానికి సంబంధించిన కార్యక్రమమని గుర్తుచేశారు. 

ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పెద్ద చరిత్ర ఉందని అమిత్‌ షా చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు పోరాడారని, దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేశారని తెలిపారు. చివరికి 2014 జూన్‌లో రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని చెప్పారు. ‘‘2004లో హామీ ఇచ్చినప్పటికీ 2014 వరకు నెరవేర్చలేదు. ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలో ప్రజాగ్రహానికి గురవుతామన్న భయంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అందులోనూ సరైన పద్ధతి పాటించలేదు.  ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఏర్పాటు చేస్తే.. ఎక్కడా ఒక్క గొడవ కూడా జరగలేదు. కానీ, ఇక్కడ మనసులు వేరయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరును విమర్శించారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సంగీతం, వేషభాషలు వేల ఏళ్ల పాటు ఇలాగే కొనసాగి భారత మాతకు కిరీటంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, నృత్యాలు, సంగీతం, చరిత్ర, ఆహారం సమగ్ర భారత సంస్కృతికి గర్వకారణమని చెప్పారు. వరంగల్‌ ఖిలా, అలంపూర్‌, సంగమేశ్వరం, రామప్ప, భద్రాచలం వంటి ప్రదేశాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు వెళుతుంటారని తెలిపారు. చాళుక్యులు, కాకతీయులు, శాతవాహనులు తమ రాజ్యాలను తెలంగాణ ప్రాంతంలో స్థాపించారని.. తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఎంతగానో పాటుపడ్డారని పేర్కొన్నారు. దేశంలో యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ  ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిని దేశం మొత్తానికి పరిచయం చేస్తున్నారంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రశంసించారు. తెలంగాణకు చెందిన రాంజీ గోండు, కుమరం భీమ్‌, స్వామి రామానంద తీర్థ, పండిట్‌ నరేంద్ర, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వారు నిజాం నుంచి విముక్తి కోసం పోరాటాలు చేశారని తెలిపారు. ‘‘దేశమంతా సర్దార్‌పటేల్‌కు రుణపడి ఉంటుంది. పటేల్‌ లేకుంటే దేశ చిత్రపటం ఇలా ఉండేది కాదేమో. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కల్పించినందుకు మనం పటేల్‌కు రుణపడి ఉంటాం. కానీ, ఇప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. భవిష్యత్తులో మేం అధికారంలోకి వస్తాం.  అప్పుడు తప్పకుండా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాం’’ అని అమిత్‌ షా ప్రకటించారు. కేంద్ర తొలి హోం శాఖ మంత్రి పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: కిషన్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.లక్ష కోట్లతో తెలంగాణలో రహదారులు అభివృద్ధి చేశామని, దాదాపు రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని చెప్పారు. రూ.26 వేల కోట్లతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు పీఎం కిసాన్‌ పథకం కింద పెట్టుబడి సాయం చేస్తున్నామని వివరించారు. ఇన్ని చేసినా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బంధీ అయ్యిందన్నారు. ప్రధాని రోజుకు 18 గంటలు పని చేస్తే, సీఎం కేసీఆర్‌ నెలకు 18 గంటలు కూడా పనిచేయరని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టులకు, కుమరం భీం మ్యూజియానికి తెలంగాణ ప్రభుత్వం భూములివ్వడం లేదని తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, మీనాక్షిలేఖి, భగవంత్‌ ఖూబా, మురళీధరన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T08:48:42+05:30 IST