భద్రంగా..బతుకమ్మా

ABN , First Publish Date - 2020-10-16T06:41:59+05:30 IST

సింగిడి రంగులన్నింటినీ కుప్పపోసినట్లు మహిళామణులు తీరొక్క పూవును ఒక్కచోటికి చేర్చి

భద్రంగా..బతుకమ్మా

నేటినుంచి తెలంగాణ పూల పండుగ 

‘ఎంగిలిపూల’తో ఉత్సవాలు ప్రారంభం

తొమ్మిదిరోజులపాటు సంబురాలు  

‘కొవిడ్‌’ నేపథ్యంలో కానరాని సందడి


ఇల్లెందు/ఖమ్మం సాంస్కృతికం, అక్టోబర్‌ 15: సింగిడి రంగులన్నింటినీ కుప్పపోసినట్లు మహిళామణులు తీరొక్క పూవును ఒక్కచోటికి చేర్చి గౌరమ్మకు సింహాసనంగా పేర్చి మురిసిపోయే తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మ ఉత్సవాలకు వేళైంది. పెతరమాస రోజు ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ ఉత్సవాలకు తెలంగాణ పల్లె సిద్ధమైంది. ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ ఉత్సవాలు కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడు భయం భయంగా జరుపుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. 


తొమ్మిది రోజుల వేడుకలు 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ ఉత్సవాలు అశ్వయిజమాసం శుద్దపాడ్యమి రోజు ప్రారంభమై 9రోజులపాటు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ప్రకృతి ప్రసాదించిన రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చి కీలకంగా గుమ్మడి పువ్వులో బొడ్డెమ్మను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. బతుకమ్మలను పేర్చడానికి మహిళలు తంగేడు పూలు, తామర పూలు, అల్లి పూలు, కట్ల పూలు, గునుగుపూలు, గుమ్మడిపూలతో పాటు బంతిపూలు, చేమంతిపూలు వినియోగిస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో గౌరి దేవికి రోజుకోరీతిలో ప్రసాదాలు సమర్పిస్తారు. 9వ రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకల్లో మొక్కజొన్న, సజ్జల పిండి, బెల్లంతో తయారుచేసిన ముద్దలు, పిండి ప్రసాదం కోసం అంతా ఎదురు చూస్తారు. పెరుగన్నం, సద్ది, చింతపండు పులిహోరా సద్ది, నిమ్మకాయ సద్ది, కొబ్బరి సద్ది, నువ్వుల సద్ది ప్రసాదాలుగా సమర్పిస్తారు.   


 నేడు ఎంగిలి పూల బతుకమ్మ 

గత ఏడు నెలలుగా కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరవుతూ ప్రాణాలు ఆరచేతుల్లో పెట్టుకొని ముఖానికి మాస్కులు ధరించి సంచరించిన మహిళలు నేటినుంచి జరిగే బతుకమ్మల వేడుకలకూ అంతే భయంతో సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయ వేడుకలు జరుపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో మహిళలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ బతుకమ్మల కోసం  రంగురంగుల పూల సేకరణలో నిమగ్నమయ్యారు. గతంలో తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ వేడుకలు ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు మొదలుకొని దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం బతుకమ్మల ప్రాశస్థ్యాన్ని గుర్తించి అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది.  


ఆలయాల్లో అనుమతి నిల్‌  

ఈ ఏడాది కరోనా వల్ల ప్రభుత్వం ఇప్పటివరకు ఆలయాల్లో సామూహిక పూజలకు అనుమతి ఇవ్వలేదు.   ఈ క్రమంలో బతుకమ్మ వేడుకలు కూడా ఎవరికివారే తమ ఇళ్ల వద్ద జరుపుకోవలసి ఉంటుంది. ఆలయాల్లో గుంపులుగా చేరేందుకు అనుమతులు లేనందున బతుకమ్మలను కూడా ఆలయాల్లోకి అనుమతించే అవకాశం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి బతుకమ్మ సందడి కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలు కూడా పూల సేకరణకు అడ్డుగా మారాయి.   

Updated Date - 2020-10-16T06:41:59+05:30 IST