Abn logo
Jul 29 2021 @ 00:00AM

పెన్నాకు నీటిపై కొర్రీ..!

పెన్నా నది

కృష్ణా జలాలు ఇతర బేసిన్లకు ఎలా తీసుకెళ్తారు..?

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

శ్రీశైలం ఆధారంగా జిల్లాలో 76.32 టీఎంసీల జలాశయాలు

కృష్ణా నీళ్లు ఆగితే గాలేరు-నగరి, టీజీపీ, మైలవరం కాలువల కింద ఆయకట్టు ప్రశ్నార్థకం

జిల్లా ప్రజాప్రతినిధులు మేల్కొనాల్సిన సమయం ఇది


‘కృష్ణా జలాలు ఇతర బేసిన్ల (పెన్నా బేసిన)కు ఎలా తీసుకెళ్తారు..? బేసిన పరిధిలోని ప్రాజెక్టుల నీటి అవసరాలకే కృష్ణా జలాలు వినియోగించాలి..? పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి పక్క బేసినకు నీటి మళ్లింపును అడ్డుకోండి..!’ ఇది గురువారం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి చేసిన ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు యాక్షనకు సిద్ధపడితే జిల్లా ప్రాజెక్టులకు గడ్డు పరిస్థితి తప్పదని సాగునీటి పారుదల నిపుణులు అంటున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి తెలంగాణ ఎత్తులకు మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే శ్రీశైలం జలాశయం ఆధారంగా జిల్లాలో 76.32 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన నీటి వనరు పెన్నా నది. ఒకప్పుడు వానా కాలంలో పుష్కలంగా వరద ఉండేది. కాలక్రమేణ నది ఒట్టిపోయి.. ఇసుక దిబ్బగా మారింది. 1969-70 నుంచి 2020-21 వరకు అంటే 52 ఏళ్ల పెన్నా నది వరద లెక్కలు పరిశీలిస్తే.. 1975-76లో 65.30 టీఎంసీలు, 1988-89లో 61.80 టీఎంసీలు అఽధిక వరద నమోదు అయింది. మరో నాలుగైదేళ్లు మధ్య మధ్యలో 20-40 టీఎంసీల వరకు వరద వచ్చింది. మిగిలిన 46 ఏళ్లలో ఒకటి నుంచి 15 టీఎంసీలకు మించి లేదు. అత్యధిక సంవత్సరాలు 10 టీఎంసీలలోపే వరద వస్తే.. కొన్ని ఏళ్లు ‘సున్నా’ వరద నమోదు కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిల్లో కరువు జిల్లా కడప రైతుల కన్నీళ్లు తుడవాలని శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి కృష్ణా జలాల మళ్లింపు కోసం 1985-86లో నాటి సీఎం ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారు. 2005 -06లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గాలేరు-నగరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండిటి ఆధారంగా జిల్లాలో 76.32 టీఎంసీల నీటిని వినియోగించుకునే జలాశయాలు నిర్మించారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ కృషి ఫలాలు ఇప్పుడిప్పుడు కరువు రైతులకు అందుతున్నాయి.


తెలంగాణ కొర్రీ

రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ విషం కక్కుతోంది. సీమకు జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటి మళ్లింపుపై అడ్డంకులు సృష్టిస్తూ.. జలజగడానికి తెరతీసింది. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లో కూడా నీటిని ఎత్తిపోసి గాలేరు-నగరి, టీజీపీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు, కరువు పల్లెకు తాగునీరు ఇవ్వాలని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేస్తే.. అంకురంలోనే ఆ ప్రాజెక్టుపై కేఆర్‌ఎంబీ, గ్రీన ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. ఇది చాలదన్నట్లు తాజాగా కృష్ణా బేసిన నుంచి పక్క బేసినకు కృష్ణా జలాలు తీసుకెళ్లకుండా అడ్డుకోవాలంటూ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఒక పక్క కొత్తగా 255 టీఎంసీలకు పైగా తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూనే.. మరో పక్క రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటోంది. శ్రీశైలం నుంచి 800-810 అడుగుల్లో కృష్ణా జలాలు ఎత్తిపోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆగస్టు 15న పర్యావరణ అనుమతుల కోసం గ్రామసభ నిర్వహించనున్నారు. దీనిపై అభ్యంతరం చెప్పేందుకు సీమ రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ కుయుక్తులకు అడ్డుకట్ట వేయాలని సాగునీటి పారుదల నిపుణులు కోరుతున్నారు.


ప్రత్యామ్నాయం ‘గుండ్రేవుల జలాశయమే’

బచావత ట్రైబ్యునల్‌ ప్రకారం కృష్ణాకు తుంగభద్ర కాంట్రిబ్యూషన 31.45 టీఎంసీలే. అందులో సంకేసుల బ్యారేజీ నుంచి 21 టీఎంసీలు, హంద్రీ నది నుంచి 10.45 టీఎంసీలు ఇవ్వాలి. వాస్తవంగా తుంగభద్ర నుంచి కృష్ణాకు ఏటా సగటున 150 టీఎంసీలకు పైగా వరద చేరుతోందని సాగునీటి పారుదల నిపుణులు అంటున్నారు. సంకేసుల ఎగువన కేసీ కెనాల్‌కు కేటాయించిన 29.90 టీఎంసీలలో 20 టీఎంసీల నిల్వకు వీలుగా గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్‌ నిర్మించి.. సర్‌ప్లస్‌ వియర్‌ నుంచి కుడి వరద కాలువ తవ్వాలి. ఆ కాలువపై కర్నూలు జిల్లా మిడుతూరు దగ్గర 8-10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయరు నిర్మించి.. అక్కడి నుంచి కడప జిల్లా కొండాపురం మండలం గండికోట ఎగువన పెన్నా నదిలో కలపవచ్చని.. తద్వారా అటు కర్నూలు, ఇటు కడప జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చవచ్చని రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు సుబ్బరాయుడు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన ప్రత్యేక దృష్టిని సారించేలా జిల్లా ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. గండ్రేవుల వల్ల కర్నూలుకు ఎంత ప్రయోజనం ఉందో.. కడప జిల్లాకు అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంది. ఎందుకంటే కేసీ కాలువ కింద ప్రత్యక్షంగా 95 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 


కృష్ణా జలాల ఆధారంగా జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు, సామర్థ్యం (టీఎంసీలు)

----------------------------------

జలాశయం సామర్థ్యం

----------------------------------

గండికోట 26.85

చిత్రావతి 10.00

పైడిపాలెం 6.00

మైలవరం 6.50

వామికొండ 1.60

సర్వరాయసాగర్‌ 3.06

బ్రహ్మంసాగర్‌ 17.74

ఎస్‌ఆర్‌-1 1.33

ఎస్‌ఆర్‌-2 2.44

-----------------------------------

మొత్తం 76.32

-----------------------------------