ఎందరికి ఉద్యోగాలిచ్చారో చెప్పండి? తేజస్వీ యాదవ్

ABN , First Publish Date - 2020-06-06T17:25:52+05:30 IST

నితీశ్ నేతృత్వంలోని సర్కార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం

ఎందరికి ఉద్యోగాలిచ్చారో చెప్పండి? తేజస్వీ యాదవ్

పాట్నా : నితీశ్ నేతృత్వంలోని సర్కార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 30 లక్షల మంది వలస కార్మికులు బిహార్‌కు చేరుకున్నారని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హమీలో భాగంగా ప్రభుత్వం ఉపాధి విషయంలో ఇప్పటి వరకూ తీసుకున్న మార్గనిర్దేశకాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించారో చెప్పాలని, వివరణాత్మకంగా ప్రభుత్వం పేర్కొనాలని ఆయన సవాల్ విసిరారు.


వలస కార్మికులు తిరిగి బిహార్‌కు చేరుకోవడంలో క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొనడంపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ‘‘పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి ఇలాంటి రిపోర్టులు రావడం షాకింగ్ విషయం. వలస కార్మికులను దొంగలుగా, దుండగులుగా చిత్రిస్తున్నారా?’’ అని తీవ్రంగా మండిపడ్డారు.


కార్మికులను తమ పౌరులుగా పరిగణించడం లేదని, వారిని దోపిడీలుగా చిత్రీకరించే ప్రయత్నం నితీశ్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత 15 ఏళ్ల నితీశ్ పాలనలో రాష్ట్రానికి ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని మూత పడ్డాయి, కొత్తగా వచ్చిన పరిశ్రమల్లో యువకులకు ఎంత మందికి ఉద్యోగాలు దొరికాయో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వలస కార్మికుల విషయంలో వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని, ఒక్కో కార్మికుడికి పది వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని తేజస్వీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-06T17:25:52+05:30 IST