మైనింగ్‌ పనులను అడ్డుకున్న తహసీల్దార్‌

ABN , First Publish Date - 2022-07-03T05:22:41+05:30 IST

మైనింగ్‌ పనులను అడ్డుకున్న తహసీల్దార్‌

మైనింగ్‌ పనులను అడ్డుకున్న తహసీల్దార్‌
మొండిగౌరెల్లిలో మైనింగ్‌ జోన్‌ స్థలాన్ని పరిశీలించి క్రషర్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ సుచరిత

  • అనుమతి లేనిదే పనులు చేయొద్దని నిర్వాహకులకు ఆదేశం
  • పనులు నిలిపివేయాలంటూ తరలివచ్చిన గ్రామస్తులు
  • ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

యాచారం, జూలై 2: మండల పరిధి మొండిగౌరెల్లిలో కొనసాగుతున్న మైనింగ్‌ పనులపై శనివారం ఆంధ్రజ్యోతిలో మొండిగౌరెల్లిలో ‘మళ్లీ మైనింగ్‌ కలకలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీల్దార్‌ సుచరిత స్పందించారు. గ్రామ పరిధి 19 సర్వే నెంబర్‌లో 12.20ఎకరాల్లో క్వారీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆంధ్రజ్యోతి కథనంతో తహసీల్దార్‌ సంఘటనా ప్రదేశానికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. గతేడాది పర్మిషన్లు కాకుండా తాజాగా మైనింగ్‌ అధికారులు జారీ చేసిన అనుతి ఉంటే చూపి పనులు చేసుకోవాలని, అదికూడా రైతులకు, స్థానికులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని తహసీల్దార్‌ క్వారీ నిర్వాహకులను ఆదేశించారు. అదే సమయంలో పనులు జరుగుతున్న ప్రదేశానికి గ్రామస్తులు చేరుకొని ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారీ ఏర్పాటు పనులు చేయొద్దన్నారు. తాము కోట్లాది రూపాయలు వెచ్చించి భూమి కొని పనులు చేసుకుంటున్నామని నిర్వాహకులు అనడంతో వారితో గ్రామస్తులు వాదనకు దిగారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అనుమతి పత్రాలను చూపాలని, అలాగే ఆర్డీవో అనుమతీ పొందాలని తహసీల్దారు సుచరిత కోరడంతో నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే క్వారీ వస్తే తమ పొలం సేద్యానికి పనికిరాకుండా పోతుందని, పైపొర మొత్తం స్టోన్‌ డస్ట్‌తో నిండుతుందని మొండిగౌరెల్లి రైతు గుర్రం చెన్నారెడ్డి అన్నాడు. భారీ పేలుళ్లతో గ్రామంలోని ఇళ్లూ ధ్వంసం అవుతాయన్నాడు. అధికారులు విచారణ చేసి మైనింగ్‌ జోన్‌ను రద్దు చేయాలని కోరాడు. అధికారులు వాస్తవాలు తెలుసుకోకుండా అనుమతిచ్చారన్నారు. క్వారీ నిర్వాహకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భూమి అంతర్భాగం నుంచే బండరాళ్లను తీస్తామని, యంత్రాలతో కోత కోస్తామని, పేలుళ్లు ఉండవన్నాడు. తమకు ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చిందన్నాడు.

Updated Date - 2022-07-03T05:22:41+05:30 IST