ఇంజన్‌లో సాంకేతిక లోపం...

ABN , First Publish Date - 2022-08-12T04:48:08+05:30 IST

ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మండలంలోని కురబలకోట రైల్వేస్టేషన్‌ వద్ద ధర్మవరం-నర్సాపూర్‌ రైలు గురువారం సాయంత్రం నిలిచిపోయింది.

ఇంజన్‌లో సాంకేతిక లోపం...
కురబలకోట రైల్వేస్టేషన్‌ వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులు

కురబలకోట వద్ద ఆగిన ధర్మవరం-నర్సాపూర్‌ రైలు

మూడు గంటల పాటు ఆలస్యం


కురబలకోట, ఆగస్టు 11 : ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మండలంలోని కురబలకోట రైల్వేస్టేషన్‌ వద్ద ధర్మవరం-నర్సాపూర్‌ రైలు గురువారం సాయంత్రం నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం నుంచి నర్సాపూర్‌ వెళ్లడానికి రైలు ధర్మవరం నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరింది. కాగా మార్గమధ్యంలోని కురబలకోట రైల్వేస్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఇంజన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో 4.35 గంటల సమయంలో ఆగిపోయింది. దీంతో రైలు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకపోవడంతో పైస్థాయి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లకు ఇబ్బంది కలగకుండా కదిరి నుంచి 6.45 గంటలకు ప్రత్యేకంగా ఇంజన్‌ను రప్పించి కురబలకోట రైల్వేస్టేషన్‌కు తరలించి ఇతర రైళ్లకు యధాప్రకారం రాకపోకలు కొనసాగించారు. స్టేషన్‌లో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టి ఆ ఇంజన్‌ను ఆ రైలుకు తగిలించడంతో 7.35 గంటలకు బయలుదేరి వెళ్లింది. కాగా రైలు మరమ్మతులకు గురి కావడంతో 3 గంటల పాటు ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ వద్ద ఇబ్బందులు పడ్డారు.


గంటన్నర ఆగిన నాగర్‌కోయిల్‌ రైలు

ములకలచెరువు, ఆగస్టు 11: ధర్మవరం నుంచి నర్సాపూర్‌ వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ రైలు కురబలకోట రైల్వేస్టేషన్‌ సమీపంలో నిలిచిపోయింది. సింగిల్‌ లైను రావడంతో ఒకే రైలు వెళ్లే వీలున్న ఈ మార్గంలో ఇదే సమయంలో వచ్చిన నాగర్‌కోయిల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్టలో నిలిపివేశారు. ముంబాయి నుంచి ములకలచెరువు మీదుగా కేరళ రాష్ట్రం నాగర్‌కోయిల్‌కు వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు సుమారు గంటన్నర పాటు మార్గంమధ్యంలోని తుమ్మణంగుట్ట రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. కనీస సౌకర్యాలు, కనీసం తాగునీరు దొరకని ప్రాంతం కావడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. రాత్రికి లైన్‌ క్లియర్‌ కావడంతో ముంబాయి-నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరి వెళ్లింది.


కురబలకోట వద్దే ఎందుకు మొరాయిస్తోందో.!

ధర్మవరం నుంచి నర్సాపూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు కురబలకోట రైల్వేస్టేషన్‌ వద్దే ఎందుకు మొరాయిస్తోందో తెలియడం లేదు. 15 రోజుల క్రితం నర్సాపూర్‌ నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిన ప్రాంతంలోనే మళ్లీ ఇప్పుడు నిలిచిపోయింది. గతంలో కూడా ఓ సారి ధర్మవరం-నర్సాపూర్‌ రైలు ఇక్కడే నిలిచిపోయింది. దీంతో కురబలకోట సమీపంలో ఈ రైలు మొరాయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-08-12T04:48:08+05:30 IST