టీచర్ల ఓట్లకు గేలం!

ABN , First Publish Date - 2021-02-27T07:06:33+05:30 IST

పంచాయతీ ఎన్నికలు ముగియడం, వెనువెంటనే ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి చల్లారలేదు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ముగిసింది. దీంతో ఉపాధ్యాయ ఓట్లపై ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున ప్రచారంలో ఉన్న కార్యకర్తలు రంగంలోకి దిగారు.

టీచర్ల ఓట్లకు గేలం!

ఎమ్మెల్సీ అభ్యర్థుల వ్యూహప్రతివ్యూహాలు

 ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 12 మంది

 ప్రధానంగా ఇద్దరు ముగ్గురు మధ్యే పోటీ

 రేసులో ఉన్న ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి అధికార పార్టీ ఎమ్మెల్యే, పీఆర్‌టీయూ, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాల మద్దతు 

యూటీఎఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి పలు ఉపాధ్యాయ సంఘాల దన్ను

 రంగంలో స్వతంత్ర అభ్యర్థిగా మరో సీనియర్‌ నేత

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ డెయిరీఫారం సెంటర్‌ :

పంచాయతీ ఎన్నికలు ముగియడం, వెనువెంటనే ఉభయగోదావరి జిల్లాల టీచర్‌  ఎమ్మెల్సీకి నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి చల్లారలేదు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ముగిసింది. దీంతో ఉపాధ్యాయ ఓట్లపై ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున ప్రచారంలో ఉన్న కార్యకర్తలు రంగంలోకి దిగారు. తమ అనుకూల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించడం కోసం అనేక రకాలుగా గేలం వేస్తున్నారు. టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 12 మంది అభ్యర్థులు బరి లో ఉండగా ఒక అభ్యర్ది డి అంబేద్కర్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోగా 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో ఇళ్ల సత్యనారాయణ, గంటా నాగేశ్వరరావు, గంధం నారాయణరావు, చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌, తిరే రవిదేవ, డాక్టర్‌ ఎంబీ నాగేశ్వరరావు, పలివెల వీర్రాజు, బడుగు సాయిబాబా, యడవిల్లి రామకృష్ణప్రసాద్‌, డాక్టర్‌ పి వంశీకృష్ణరాజా, షేక్‌ సాబ్జి బరిలో నిలిచారు. అయితే అత్యంత ఉత్కంఠగా మారిన ఈ ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురి మధ్యే హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు తమ గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీరిద్దరిలో ఒక అభ్యర్థి గంధం నారాయణరావు బంధువు అయిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. తన బంధువు గెలుపు కోసం వ్యూహాన్ని రచించి, ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి ఆ ఎమ్మెల్యే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ అభ్యర్థికి పీఆర్‌టీయూ, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఇక యూటీఎఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్‌ సాబ్జికి పలు ఉపాధ్యాయ సంఘాలు మద్ద తు ప్రకటించాయి. దీంతో ఓటర్ల విషయంలో ఇద్దరికి బలమైన కేడర్‌ ఉండడంతో ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక ఎమ్మెల్సీ అభ్య ర్థుల తరపున ప్రచారంలోకి దిగిన కార్య కర్తలు తమ అనుకూల అభ్యర్థికి మొద టి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచా రం ఊదరగొడుతున్నారు. ఓటర్లకు గేలం వేయడంతోపాటు శిబిరాలు కూడా ఏర్పాటుచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చారు. ఇద్దరు అభ్యర్థులకు బలమైన ఓటు బ్యాంకు గల ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉండడంతో రెండవ ప్రాధాన్యత ఓటు కోసమూ పట్టుబడుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓటుతో జిల్లా నుంచి గతంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భాలు ఉండడంతో ఆ దిశగా లెక్కలు కడుతున్నారు. కాగా వీరిద్దరికీ పోటీగా మరో అభ్యర్థి బలంగా నిలవడంతో త్రిముఖ పోటీ అనివార్యం కానుందని భావిస్తు న్నారు. 11 మంది పోటీ పడుతుండగా ముగ్గురు అభ్యర్థులకు బలమైన నాయకత్వం వెనుక ఉండి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా, మిగిలిన 8 మంది అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. 

ఓటర్లు ఇలా..

మన జిల్లాలో మొత్తం 67 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడ 5953 పురుష ఓటర్లు, 3607 మహిళా ఓటర్లు మొత్తం 9560 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 49 పోలింగ్‌ కేంద్రాలుండగా, 4693 పురుష ఓటర్లు, 3032 మహిళా ఓటర్లు మొత్తం 9560 మంది ఓటర్లు ఉన్నారు. రెండు జిల్లాలకు కలిపి 116 పోలింగ్‌ కేంద్రాలుండగా, 10646 మంది పురుష ఓటర్లు, 6639 మంది మహిళా ఓటర్లు మొత్తం 17285 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వారు టీచర్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించనున్నారు. ఒక్కోసారి రెండో ప్రాధాన్య ఓట్లూ విజయాన్ని తారుమారు చేస్తాయి. అయితే వీరిద్దరికీ పోటీగా మరో అభ్యర్థి పూర్వ యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో పోటీ త్రిముఖంగా ఉంటుందని టీచర్‌ ఓటర్లు భావిస్తున్నారు. మొత్తం 11 మంది పోటీ పడుతుండగా ముగ్గురు అభ్యర్థులకు బలమైన నాయకత్వం వెనుక ఉండి గెలుపుకోసం ప్రయత్నిస్తుండగా, మిగిలిన 9 మంది అభ్యర్థులు వారి ప్రయత్నాల్లో ఉన్నారు.

పోలింగ్‌ ఏర్పాట్లు వేగవంతం 

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాం గం సర్వం సిద్దం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నిగ్‌ అధికారి, కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ప్రిసైడింగ్‌ అధికారులు(పీవో), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు(ఏపీవో)ను సమాయత్తం చేశారు. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 



Updated Date - 2021-02-27T07:06:33+05:30 IST