‘దేశం’ దూకుడు..!

ABN , First Publish Date - 2020-11-18T06:23:30+05:30 IST

తిరుపతి లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం

‘దేశం’ దూకుడు..!

అందరికన్నా ముందే తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థి ప్రకటన 

టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపిన అధినేత నిర్ణయం


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభకు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నిక జరగొచ్చని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీలో అభ్యర్థి విషయమై చర్చలు మొదలుకాకనే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థినే ప్రకటించేశారు. తనదైన శైలికి భిన్నంగా ముందే అభ్యర్థిని ప్రకటించి శ్రేణుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ నిర్ణయం జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతితో ఉప ఎన్నిక అనివార్యం కానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరిగే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీలో రెండు రోజుల ముందు వరకూ పెద్దగా చర్చలేవీ జరగలేదు. కనీసం ఆశావహులూ తెరమీదకు రాలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఓ విధమైన నిశ్శబ్దం ఆవహించినట్టే కనిపించింది. అలాంటిది సోమవారం సాయంత్రం హఠాత్తుగా టీడీపీ అధినేత ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు.


జిల్లా నేతలతో జూమ్‌ యాప్‌ ద్వారా కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తారని ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికలతోనే వైసీపీ పతనానికి నాంది పలకాలంటూ కార్యకర్తలకు పిలుపివ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీకి తొలి హెచ్చరిక జారీ చేశారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. అనివార్యంగా మిగిలిన పార్టీలూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీ తనకున్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా రంగంలోకి దిగడం ఆనవాయితీ. అదే సమయంలో ప్రతిపక్షం ఎంతోకొంత నిరాసక్తంగానే తప్పదంటూ సన్నద్ధం కావడం తెలిసిందే.


తిరుపతి ఉప ఎన్నికలో ఈ ఆనవాయితీని టీడీపీ అధినేత తిరగరాశారు. అభ్యర్థిని ప్రకటించడం ద్వారా తొలి అడుగు తనే ముందుకేశారు. బలమైన మహిళా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. ఎన్నికల నిర్వహణకు కమిటీని కూడా నియమించారు. నిజానికి పార్లమెంటు నియోజకవర్గాల వారీ పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడం కూడా కొంతమేరకు లాభించింది. నెల రోజులుగా ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇపుడు అభ్యర్థిని ప్రకటించి మరో కీలక ముందడుగు వేశారు. పనబాక లక్ష్మి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండటం, గత ఎన్నికల్లో పోటీ చేసిన పరిచితురాలు కావడం తమకు కలసివచ్చే అంశమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. 


ముందస్తు.. ఎంతో కీలకం

ముందుగా అభ్యర్థిని ప్రకటించడం ఎన్నికల్లో ఎంతో కీలకం. అసంతృప్తులను బుజ్జగించడానికి, నిధుల సమీకరణకు, నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశం కావడానికి, సాధ్యమైనంత మంది ఓటర్లను నేరుగా కలవడానికి చాలా ఉపకరిస్తుందన్నది తెలిసిందే. తద్వారా ప్రచారపర్వంలో ప్రత్యర్థులకన్నా ముందుండేలా చంద్రబాబు నిర్ణయం అవకాశం కల్పించింది. గతంలో అనేక సందర్భాల్లో అభ్యర్థులను ఆఖరిక్షణంలో ప్రకటించడం ద్వారా పలు స్థానాలు కోల్పోయిన అనుభవమున్న నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక విషయంలో అధినేత తీరుపట్ల పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కొంతకాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, న్యాయస్థానాలతో ఏర్పడిన అంతరం, ఎస్సీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులు వంటి పరిణామాల నేపధ్యంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండటం వంటి పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో కదలిక తెప్పిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు టీడీపీ వర్గాల్లో కొత్త ఆలోచనలను రగిల్చింది. అంతిమంగా అధినేత దూకుడు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.

Updated Date - 2020-11-18T06:23:30+05:30 IST