Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇక సహించం

వైసీపీ అరాచకాలపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు 

అధినేత చంద్రబాబుకు జిల్లా నేతల సంఘీభావం 

విజయవాడ నుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు


టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ మూకల దాడుల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం వేడెక్కింది.  తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు జిల్లాలోని టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. వైసీపీ అరాచకాలపై మండిపడ్డాయి. ఇదే ధోరణి కొనసాగితే సహించేది లేదని హెచ్చరించాయి.  ‘వైసీపీ ఎక్కడుంటే అక్కడ టీడీపీ వాళ్లు ఉంటారు.. కొట్టుకుందామంటే కొట్టుకుందాం.. ఒకేసారి తేల్చేసుకుందాం.’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్‌ విసిరారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ అరాచక రాజకీయాలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు భారీగా కదిలారు. శుక్రవారం చంద్రబాబు దీక్షాస్థలి వరకు పలు మార్గాల్లో ర్యాలీగా వెళ్లి అధినేతకు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట నుంచి విజయవాడ పార్లమెంటు  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నెట్టెం రఘురామ్‌, పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో కార్యకర్తలను కలుపుకొని స్థానిక నేతలు భారీగా తరలివెళ్లారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి దేవినేని ఉమా నేతృత్వంలో మంగళగిరి ఆఫీసుకు  కార్లలో  క్యూ కట్టారు. ముఖ్యంగా విజయవాడ కేశినేని భవన్‌ నుంచి  ఎంపీ కేశినేని నాని నేతృత్వంలో భారీ ర్యాలీగా వెళ్లారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, విజయవాడ మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ తదితరులు శుక్రవారం చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలపై విరుచుకుపడ్డారు. ‘కొట్టుకుందాం రండి... పీడబ్ల్యు గ్రౌండా? ఇందిరాగాంధీ స్టేడియమా చెప్పండి’ అంటూ కేశినేని నానీ, తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్‌ తాట తీస్తారని బుద్దా వెంకన్న తదితరులు ఆవేశంలో ఊగిపోయారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడటం ఏ సంస్కృతి? అంటూ మండిపడ్డారు. గంజాయి, హెరాయిన్‌ వంటి మత్తు పదార్థాలకు ఆంధ్రప్రదేశ్‌ను అడ్డాగా మార్చేశారంటూ దుయ్యబట్టారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, వెంటనే ఆర్టికల్‌ 356ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తాడో పేడో తేల్చుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.


జిల్లా అంతటా నిరసనలు

జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో టీడీపీ శ్రేణులు అధినేతకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. పలుచోట్ల స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ప్రసంగాలు చేశారు. తమ పార్టీ కార్యాలయాలు, తమ నేతల ఇళ్లపై దాడి చేయగమేగాక తమ వారినే అరెస్టు చేయడం, కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా గన్నవరంలో చేపట్టిన నిరశన దీక్షలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు


Advertisement
Advertisement