వెలిగొండ కోసం టీడీపీ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-19T06:26:53+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టుపై వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

వెలిగొండ కోసం టీడీపీ పాదయాత్ర
మార్కాపురంలోని కందుల నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు

వచ్చేనెల 1 నుంచి 5 వరకూ కార్యక్రమం

కందుల నివాసంలో మూడు సెగ్మెంట్ల నేతలు భేటీ

ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టుపై వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు కింద తొలిదశలో లబ్ధి చేకూరే ప్రాంతాలైన మార్కాపురం, వైపాలెంతోపాటు కొంత ప్రాంతం ఉన్న దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాలు కలిసి వచ్చేలా ఆపార్టీ నేతలు రూట్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నారు. ఇందుకోసం సోమవారం మార్కాపురంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి, వై.పాలెం, దర్శి ఇన్‌చార్జిలు గూడూరి ఎరిక్షన్‌బాబు, పమడి రమేష్‌, ఇతర ఆ ప్రాంత ముఖ్యనేతలు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కృష్ణా ఎగువ ప్రాజెక్టుల నిర్మాణంతో వెలిగొండకు జరగనున్న నష్టం, ఆపై కేంద్ర గెజిట్‌లో అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొనడంపై గత మూడు నెలలుగా టీడీపీ గళం విప్పుతున్న విషయం విదితమే. జిల్లాకు చెందిన ఆపార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామిలు చొరవ తీసుకొని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సీఎంకి బహిరంగ లేఖలు రాయడంతోపాటు, ఏకంగా జిల్లా పార్టీ నాయకత్వం అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి నివేదించారు. మరోవైపు మార్కాపురంలో వారంరోజులపాటు దీక్షల అనంతరం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో నిరసనలు కొనసాగాయి. ఇది విస్తృత చర్చకు దారితీసింది. అయితే ప్రభుత్వపరంగా అవసరమైన మేర స్పందన రాలేదన్న భావనకు వచ్చిన టీడీపీ నేతలు మరింత ఒత్తిడి తెచ్చే వైపు దృష్టిపెట్టారు. తదనుగుణంగా సోమవారం మార్కాపురంలో కీలక భేటీ జరిగింది. వచ్చేనెల 1 నుంచి 5 వరకు ఐదు రోజులపాటు మూడు నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర కొనసాగించేలా నిర్ణయించారు. దొనకొండ నుంచి పాదయాత్ర ప్రారంభించి మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రాథమికంగా రూట్‌ మ్యాప్‌ను రూపొందించారు. వెలిగొండ పరిధిలో ఉండే గిద్దలూరు, కనిగిరి సెగ్మెంట్లలో మరో విడత ఈ తరహా కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. జిల్లాకు ప్రాణప్రదమైన వెలిగొండకు శంకుస్థాపన చేసింది, కీలకమైన పనుల పురోగతి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలనలోనే కాగా, ప్రస్తుత ప్రభుత్వం వల్ల ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకం మారే పరిస్థితి వచ్చిందని, ఆ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళేందుకే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించామని వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు తెలిపారు. వెలిగొండ కోసం జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలు టీడీపీ కార్యకర్తల సహకారంతో  ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. వచ్చేనెల 1 నుంచి చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 





Updated Date - 2021-10-19T06:26:53+05:30 IST