ఇక యుద్ధమే..

ABN , First Publish Date - 2022-09-04T06:04:14+05:30 IST

తెలుగుదేశం దూకుడు పెంచింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ నడపడంలో ఇన్‌ఛార్జ్‌లే కీలకమన్న సంకేతాలు పంపింది. ఇకపై పార్టీ ప్రణాళికలన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది.

ఇక యుద్ధమే..

పశ్చిమలో సైకిల్‌ జోరు

ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై సమరభేరి

బాదుడే బాదుడుతో జనంలోకి.. సాయంలోనూ ముందు

నిర్బంధాలను అధిగమించే ప్రజాక్షేత్రంలో దూకుడు

సభ్యత్వ నమోదులోనూ లక్ష్యాలు

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

నెలలో 20 రోజులు ఇన్‌చార్జ్‌లు జనంలోనే


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం దూకుడు పెంచింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ నడపడంలో ఇన్‌ఛార్జ్‌లే కీలకమన్న సంకేతాలు పంపింది. ఇకపై పార్టీ ప్రణాళికలన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. పార్టీ ముఖ్యనేతల విస్తృత స్థాయి సమావేశంలో అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఇన్‌ఛార్జ్‌లపై మరింత బాధ్యత పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో  నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ కాస్త స్తబ్దుగా ఉండేది. ఆ తర్వాత కరోనాతో గడప దాటలేని పరిస్థితి. కొంత కాలంగా పరిస్థితులు పూర్తిగా మారాయి. జిల్లాలో అన్ని నియోజక వర్గాలకు పూర్తిస్థాయి ఇన్‌ఛార్జ్‌లు వచ్చారు. ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్న ఆర్టీసీ, పెట్రోల్‌, విద్యుత్‌ ఛార్జీలు, పన్నుల వడ్డనలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల పక్షాన పోరాడేందుకు ఆందోళన చేపడదామంటే ఇటీవల కాలంలో పోలీసుల నిర్బంధం అధికమైంది. ధర్నాలకు, ఆందోళనలకు కాలు బయట పెడితే పోలీసులు నిఘా పెడుతున్నారు. కేసులు బనాయిస్తున్నారు. రైతులకు ధాన్యం సొమ్ములు ఇవ్వాలంటూ పెంటపాడు మండలం అలంపురంలో ఽధర్నా నిర్వహించినందుకు తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. అయినా ప్రజాక్షేత్రంలో ఉండేందుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఎంఎల్‌ఎలు, ఇన్‌ఛార్జ్‌ల నేతృత్వంలో దూసుకువెళుతున్నారు. వరద బాధితులకు సహాయ సహకార అందించడంలోనూ జిల్లాలో తెలుగుదేశం గురుతర బాధ్యత నిర్వహించింది. బాధితులకు పెద్ద ఎత్తున నిత్యావసర సరకులు, కూరగాయాలు అందించింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఇన్‌ఛార్జ్‌లు సరకులు పంపారు. పశుగ్రాసాన్ని అందించారు. ఇలా ప్రజా సేవలో నిమగ్నమవుతూనే ప్రజాపక్షాన పోరాడేందుకు జనంతో మమేకం అవుతున్నారు. అన్న క్యాంటీన్‌లు తొలగిస్తే పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంతంగా క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. 


సభ్యత్వ నమోదులోనూ పోటీ

తెలుగుదేశం సభ్యత్వ నమోదును ఈ సారి పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యకర్త, అభిమానిని కలిసి సభ్యత్వ నమోదు చేసేలా అధిష్ఠానం ప్రణాళిక రచించింది. సెప్టెంబరు 30లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని దిశా నిర్దేశం చేసింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కనిష్టంగా 25 వేల సభ్యత్వాన్ని నమోదు చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును పూర్తి చేశారు. ప్రస్తుతం 10 వేల సభ్యత్వానికి చేరువలో ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేసుకున్నారు. సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త అంగీకారం ఉండాలి. అతని సెల్‌ఫోన్‌కు ఓటీపీ వెళుతుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాతే ఆన్‌లైన్‌లో సభ్యత్వ రూపొందుతుంది. దీనివల్ల కచ్చితమైన సభ్యత్వ నమోదవుతుందన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉంది. క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు సొంతంగా సాంకేతిక సిబ్బందిని నియమించుకుని సభ్యత్వ నమోదును చేపడుతున్నారు. మరోవైపు బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు ఈ మాసాంతంలోగా పూర్తి చేయాలని అధిష్ఠానం దిశా నిర్దేశం చేసింది. ఓటరు జాబితాను పరిశీలించాలి. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని క్షేత్ర స్థాయిలో నియమించాలి. అనుబంధ సంఘాలను క్రియాశీలంగా ఉండేలా చూసే బాధ్యతను ఇన్‌ఛార్జ్‌లపైనే పెట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ అనుబంధ సంఘాలను ఇప్పటికే నియమించారు.  


జనానికి అందుబాటులో..

ప్రతి ఇన్‌చార్జ్‌ నెలలో 20 రోజులు నియోజకవర్గంలోని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు పంపింది. ఇప్పటికే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో ఇన్‌ఛార్జ్‌లు జనంలోకి వెళుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ప్రజల తరపున పోరాటం చేసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఏపీ టిడ్కో, జగనన్న ఇళ్లు, ఓటీఎస్‌ వంటి పథకాలపై తెలుగుదేశం తీవ్ర ఒత్తిడినే పెంచింది. తెలుగుదేశం శ్రేణులు ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు ఇన్‌చార్జ్‌ల పార్టీ కార్యకలాపాలపై అధిష్ఠానం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతోంది. క్షేత్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల నివేదికను రప్పించుకుంటోంది. తదనుగుణంగా నియోజక వర్గాలకు గ్రేడ్‌లు ఇస్తున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మూడుకుపైగా ఎ గ్రేడ్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. 

Updated Date - 2022-09-04T06:04:14+05:30 IST