మహానాడులో తెలుగు తమ్ముళ్ల వాణి

ABN , First Publish Date - 2020-05-29T08:59:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న మహానాడులో జిల్లా నాయకులు రెండో రోజు గురువారం కూడా ఉత్సాహంగా ..

మహానాడులో తెలుగు తమ్ముళ్ల వాణి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : తెలుగుదేశం పార్టీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న మహానాడులో జిల్లా నాయకులు రెండో రోజు గురువారం కూడా ఉత్సాహంగా పాల్గొని తమ వాణి వినిపించారు. కరోనా విజృంభిస్తున్నా, దాని తీవ్రతను తక్కువ చేసిన జగన్‌, వైరస్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారని పలువురు నేతలు విమర్శించారు. జిల్లావ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలంతా తమ తమ ప్రాంతాల నుంచి మహానాడును వీక్షించారు. 


కరోనాను తక్కువ చేసే ప్రయత్నం : పట్టాభి 

జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ను ప్రతి రోజూ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ పత్రికలన్నీ జగన్‌ విధానాలను ఎండగట్టాయి. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ కరోనా వైరస్‌ విషయంలో చంద్రబాబు కృషిని ప్రశంసించారు. వలస కార్మికులను జగన్‌ ఏనాడూ పట్టించుకోలేదు. వారికి సౌకర్యాలు కల్పించలేదు. వలస కార్మికులపై లాఠీచార్జ్‌ చేయించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పిన వ్యక్తి చంద్రబాబు. వైసీపీ ఎమ్మెల్యేలు అనేక చోట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవరించడంతో కరోనా కేసులు పెరిగాయి. కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన రూ.2500 కోట్ల నిధుల్ని దారి మళ్లించారు. కరోనాను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. 


కరోనా నియంత్రణలో జగన్‌ విఫలం : జవహర్‌, మాజీ మంత్రి 

కరోనాను నియంత్రించడంలో జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, వైరస్‌ వాహకులుగా పని చేశారు. మాస్క్‌లు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్‌ సుధాకర్‌పై కక్షసాధింపు చర్యలకు దిగారు. రెక్కలు విరిచి నడిరోడ్డుపై దాడి చేశారు. వలస కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. అన్న క్యాంటీన్లు మూసేసి పైశాచిక ఆనందం పొందారు. కేంద్ర సాయాన్ని దుర్వినియోగం చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు. మళ్లీ మంచి రోజులు వస్తాయి. 


పార్టీకి ఆచంట సునీత విరాళం

టీడీపీ మహానాడు కార్యక్రమంలో పార్టీకి చందాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత రూ.50 వేల చెక్కును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి అందజేశారు. 

Updated Date - 2020-05-29T08:59:30+05:30 IST