Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇక్కడే గెలుస్తా.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా!

జగన్‌ మాదిరి మాట తప్పను

ఆళ్ల మాదిరి మాట మార్చను

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

మంగళగిరి, నవంబరు 26: ముఖ్యమంత్రి జగన్‌మాదిరి నేను మాట తప్పను.. ఇక్కడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిమాదిరి మాట మార్చను.. ఎన్ని కష్టాలెదురైనా నేను ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి పార్టీ ఇన్‌ఛార్జి నారా లోకేశ్‌ అన్నారు. వరుసగా మూడోరోజైన శుక్రవారం ఆయన మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి పుర ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలను గురించి అడిగి విచారించడంతోపాటు అవ్వతాతలు, వికలాంగులు, చేతివృత్తులవారిని కలుసుకుని వారి సమస్యలను గురించి ఆరా తీశారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పార్టీ కార్యకర్తల నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించడంతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను కలుసుకుని వారికి మనోధైర్యం చెప్పారు. మరో పదిమంది చిన్నతరహా వ్యాపారులకు తోపుడుబండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల లోకేశ్‌కు ప్రజలు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయకుండా తమను నానా ఇబ్బందులు పెడుతున్నారని.. ఫించన్‌లను నిలిపివేస్తున్నారని... వివిధ సంక్షేమ పథకాలకు ఏవో కారణాలతో కత్తెర వేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసి తమ ఆవేదన వెలిబుచ్చారు. లోకేశ్‌ వారిని ఓదారుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాము నమ్మి వైసీపీకి ఓట్లు వేస్తే టిడ్కో ఇళ్లను ఇంతవరకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చినపంజా వీధి ప్రజలు చెప్పగా.. టీడీపీ హయాంలలో మంగళగిరితో కలిపి సుమారు 12వేల గృహాలను నిర్మించామని లోకేశ్‌ అన్నారు. వాటిని పూర్తిచేసి గృహ లబ్ధిదారులకు స్వాధీనం చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. మరో మహిళ మాట్లాడుతూ తనకు భర్త చనిపోతే నాడు చంద్రబాబు ఫించన్‌ ఇచ్చాడని... నేడు కొర్రీలతో ఫించన్‌ను కట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ సారి వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మా చెప్పుతో మేము కొట్టుకోవాలని మహిళలు ఆవేదను వ్యక్తం చేశారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారంటూ మరో మహిళ ఆవేదన వ్యక్తం చేయగా.. పనికిమాలిన మంత్రి సన్నాసి మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడమ్మా! ఇంటికే రేషన్‌ అంటూ ఖాళీ బండ్లను వీధుల్లో తిప్పుతున్నారన్నారు. వాటితో ఖర్చు తప్ప ఉపయోగమే లేదని లోకేశ్‌ అన్నారు. ఆయన వెంట పలువురు నేతలు పాల్గొన్నారు.  

పార్కురోడ్డులో దివ్యాంగురాలితో మాట్లాడుతున్న లోకేశ్‌


Advertisement
Advertisement