మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2022-07-05T04:08:15+05:30 IST

మున్సిపల్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ పట్ల వివక్ష చూపుతున్నారని, నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని, తమ సత్తా ఏమిటో చూపిస్తామని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి
మున్సిల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ నేతలు

అడ్డుకున్న పోలీసులు, దూసుకెళ్లిన టీడీపీ నేతలు

కావలి, జూలై 4: మున్సిపల్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ పట్ల వివక్ష చూపుతున్నారని, నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని, తమ సత్తా ఏమిటో చూపిస్తామని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మైనార్టీ నాయకుడి ఇంటి ముందు పక్షులను పెంచుకునేందుకు వేసుకున్న రేకుల షెడ్డును ఈ నెల 2వ తేదీన మున్సిపల్‌ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో కూల్చి వేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో  నేతలు, కార్యకర్తలు సోమవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని లోపలకు పోకుండా అడ్డుకోవటంతో పోలీసులను సైతం లెక్కచేయకుండా దూసుకుని లోపలకు వెళ్లారు. అక్కడ కమిషనర్‌ చాంబర్‌లోకి వెళ్లకుండా అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముందుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మున్సిపల్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం గేటు వద్ద ముట్టడించి ఎవరినీ లోపలకు పోకుండా అడ్డుకున్నారు. అప్పటికే కార్యాలయంలో ఉన్న మున్సిపల్‌ కమిషనర్‌ బి.శివారెడ్డి బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి సరైన సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా అధికారపార్టీకి వత్తాసుగా మాట్లాడుతూ లోపలకు వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు కూడా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొనగా వారిని తప్పుకుని లోపలకు దూసుకెళ్లారు. కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారం ఎలాంటి ఆక్రమణలు తొలగించినా అభ్యంతరం లేదని, కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల నిర్మాణాలను మాత్రమే ఆక్రమణల పేరుతో తొలగిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మన్నవ రవిచంద్ర, మొగిలి కల్లయ్య, జ్యోతి బాబూరావు, యేగూరి చంద్రశేఖర్‌ టీడీపీ దాని అనుబంద సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T04:08:15+05:30 IST