వైసీపీ సోషల్‌ మీడియా సంఘ విద్రోహ శక్తుల ముఠా

ABN , First Publish Date - 2022-08-04T05:48:20+05:30 IST

సంఘ విద్రోహ శక్తులన్నీ ఒక ముఠాగా ఏర్పడి జగన్‌రెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ సోషల్‌ మీడియా వేదికగా పనిచేస్తున్నాయని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు.

వైసీపీ సోషల్‌ మీడియా సంఘ విద్రోహ శక్తుల ముఠా
మంగళగిరి రూరల్‌ సీఐ భూషణంకు ఫిర్యాదు చేస్తున్న మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్‌బాబు

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు 

మంగళగిరి సిటీ, ఆగస్టు 3: సంఘ విద్రోహ శక్తులన్నీ ఒక ముఠాగా ఏర్పడి జగన్‌రెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ సోషల్‌ మీడియా వేదికగా పనిచేస్తున్నాయని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరీ మరణంపై వైసీపీ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటరు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తదితరులు మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ భూషణంకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఉమామహేశ్వరీ మరణిస్తే విచారం వ్యక్తం చేయకపోగా జగన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీ సోషల్‌ మీడియా సభ్యసమాజం సిగ్గుపడేలా అసత్యా లను ప్రచారంచేయడం దుర్మార్గమన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఏమాత్రం సిగ్గు, లజ్జ లేకుండా విషపూరితమైన ట్వీట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలను కప్పిపుచ్చేందుకే వైసీపీ ఈ తరహా అబద్దపు ప్రచారానికి తెరలేపిందన్నారు. మాజీమంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి ఏరులై పారుతున్నా నియంత్రించలేని పోలీసులు న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీ శ్రేణులపై జులుం ప్రదర్శించడం శోచనీయమన్నారు. ఉమామహేశ్వరీ మృతిపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవేందర్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, నేతలు బుచ్చి రామ్‌ప్రసాద్‌, తోట పార్థసారధి, షేక్‌ రియాజ్‌, కారంపూడి అంకమ్మరావు, గుత్తికొండ ధనుంజయ రావు, జవ్వాది కిరణ్‌చంద్‌, మహమ్మద్‌ ఇబ్రహీం, వాకా మంగారావు, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సీఐ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

ఫిర్యాదు అనంతరం పోలీసు స్టేషన్‌ వెలుపల మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలు విలేకరులతో మాట్లాడుతుండగా మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం అభ్య ంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు, సీఐ భూషణం మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అందరిపై కేసులు పెట్టండంటూ సీఐ వ్యాఖ్యానించడంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఈలోగా పట్టణ సీఐ అంకమ్మరావు అక్కడకు చేరుకుని సర్ది చెప్పారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంబాబు హుటాహుటిన పోలీసు స్టేషనుకు చేరుకునేలోగా వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2022-08-04T05:48:20+05:30 IST