గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-20T05:30:00+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాయలం.. ఆ పార్టీ నాయకుల ఇళ్లపై అల్లరిమూకల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను దిగ్విజయం చేసేందుకు బుధవారం తెల్లారగానే ...

గృహ నిర్బంధం
కమలాపురం రైల్వేగేటు వద్ద పుత్తా ఆధ్వర్యంలో రాస్తారోకో

తెల్లారకనే టీడీపీ నేతల ఇళ్లకు చేరుకున్న పోలీసులు

గడప దాటకుండా హౌస్‌ అరెస్టులు

రాజంపేటలో రోడ్డుపైనే పడుకున్న బత్యాల

మైదుకూరులో పుట్టా సుధాకర్‌ ధర్నా.. అరెస్టు

కమలాపురంలో పుత్తా ధర్నా.. సాయి ర్యాలీ

వేంపల్లిలో తెలుగుయువత బైక్‌ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి గృహ నిర్బంధం

కడపలో హరిప్రసాద్‌, అమీర్‌బాబు.. ప్రొద్దుటూరులో లింగారెడ్డి.. దుంపలగట్టులో రెడ్యం హౌస్‌ అరెస్టు

టీడీపీ రాష్ట్ర బంద్‌ నిర్వీర్యం చేయడంలో పోలీసులు సక్సెస్‌

టీడీపీ నేతలకు ఆంక్షలు.. వైసీపీ ర్యాలీలకు అనుమతులు


(కడప-ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాయలం.. ఆ పార్టీ నాయకుల ఇళ్లపై అల్లరిమూకల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను దిగ్విజయం చేసేందుకు బుధవారం తెల్లారగానే పార్టీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. అయితే అంతకంటే ముందే వారి ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని గడప దాటి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. పోలీసుల వ్యూహాన్ని దాటి రోడ్లపైకి చేరుకున్న పార్టీ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లు, ప్రైవేటు కళ్యాణ మండపాలకు తరలించి నిర్బంధించారు. ఆంక్షల ముసుగులో ప్రజాగొంతుకులను అణచివేశారు. టీడీపీ రాష్ట్ర బంద్‌ నిర్వీర్యం చేయడంలో పోలీసులు ప్రధాన భూమిక పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పొద్దుపొడవక ముందే టీడీపీ నాయకుల ఇళ్లకు పోలీసులు చేరుకున్నా.. ఆర్టీసీ బస్టాండ్లు.. ప్రధాన కూడళ్లలో వందల మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసినా.. పలు చోట్ల వారి వ్యూహాలను ఛేదించుకొని రోడ్లపైకి చేరారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. టీడీపీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులను ఖండిస్తూ ప్రజా గొంతుక వినిపించారు.


పోలీసుల వ్యూహాలను ఛేదించి..

జిల్లాలో టీడీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జరగకుండా బందోబస్తు పేరుతో ఆంక్షలు, హౌస్‌ అరెస్టులు చేసినా.. పోలీసుల వ్యూహాలను ఛేదించి పలువురు రోడ్డెక్కారు. రాజంపేట టీడీపీ ఇనచార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు టీడీపీ కార్యకర్తలతో కలసి ఎన్టీఆర్‌ కూడలిలో కడప-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని నిరనస తెలిపారు. వాహనాలు బారులు తీరాయి. డీఎస్పీ శివభాస్కరరెడ్డి అక్కడికి చేరుకొని బత్యాలను అరెస్టు చేసి స్టేషనకు తరలించారు. అరెస్టును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తెల్లాకరనే రాజంపేట ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. మైదుకూరు టీడీపీ ఇనచార్జి, టీటీడీ మాజీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌ పార్టీ కార్యకర్తలతో కలసి నాలుగురోడ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. దుకాణాలు తెరవకుండా.. ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లకుండా రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను ఆరెస్టు చేసి స్టేషనకు తరలించారు. అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన ఎదుట నిరసన తెలిపారు. కమలాపురంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయింరు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మను హౌస్‌ అరెస్టు చేస్తే.. పోలీసుల వ్యూహం నుంచి బయట పడి కిలోమీటరుకు పైగా ర్యాలీ నిర్వహించారు. వేంపల్లి పట్టణంలో మైనార్టీ కార్పొరేషన రాష్ట్ర మాజీ డైరెక్టరు షబ్బీర్‌ ఆధ్వర్యంలో తెలుగుయువత కార్యకర్తలు వీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. కడప పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి కలసపాడు మండలం నరసాపురంలో ధర్నా చేశారు.


ఎక్కడికక్కడ గృహ నిర్బంధం

టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేసి రాష్ట్ర బంద్‌ను నిర్వీర్యం చేయడంలో పోలీసులు ప్రధాన భూమిక పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కడప నగరంలో బంద్‌ పాటించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ బయలుదేరుతుండగా ఇంటి గడప దాటకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కడన నియోజకవర్గం ఇనచార్జి అమీర్‌బాబు కార్యకర్తలతో కలసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన్ని హౌస్‌ అరెస్టు చేశారు. పులివెందుల టీడీపీ ఇనచార్జి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని సింహాద్రిపురంలో, జమ్మలమడుగు టీడీపీ నాయకులు దేవగుడి భూపే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలను దేవగుడిలోనే గృహ నిర్భంధం చేశారు. కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డిని అరెస్టు చేసి పెన్నా తీరంలో హెల్త్‌క్లబ్‌కు, ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇనచార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలను ముందుస్తుగా అరెస్టు చేసి చాపాడుకు తరలించారు. బద్వేలులో టీడీపీ నేత డాక్టరు ఓబులాపురం రాజశేఖర్‌, పోరుమామిళ్లలో పార్టీ అధ్యక్షుడు భైరవప్రసాద్‌, గోపవరంలో పార్టీ నాయకులు సుధాకర్‌ను గడప దాటనివ్వలేదు. రైల్వేకోడూరు ఇనచార్జి కస్తూరి విశ్వనాథనాయుడు తిరుపతి నుంచి వస్తుండగా లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం వద్ద ఆయనను, టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి అదే మండపంలో నిర్బంధించారు. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ను చిట్వేలిలో హౌస్‌ అరెస్టు చేశారు. రాయచోటిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, తెలుగుయువత రాజంపేట పార్లమంట్‌ అధ్యక్షుడు నవీనకుమార్‌రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. ఇలా ఎక్కడికక్కడ నిర్బంధించి రాష్ట్ర బంద్‌ నిర్వీర్యం చేసినా.. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. 


ఇదేమి న్యాయం..?

టీడీపీ గృహ నిర్బంధం, అరెస్టు చేసిన పోలీసులు.. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం విమర్శలు తావిస్తోంది. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి.. అధికారపక్ష నాయకులకు ర్యాలీలకు ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం కొసమెరుపు. ఇదేమి న్యాయం అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. కడప నగరంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు అంబేడ్కర్‌కూడలిలో టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పులివెందులలో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ కర్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద పట్టాభిని అరెస్టు చేయాలని నిరసన తెలిపారు. జిల్లాలో పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి కార్యక్రమాలు చేశారు.





Updated Date - 2021-10-20T05:30:00+05:30 IST