చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2021-04-13T05:54:08+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలో జరిగిన దాడి పిరికిపంద చర్య అని టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు పేర్కొన్నారు.

చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య

టీడీపీ నేతల ధ్వజం

గుంటూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలో జరిగిన దాడి పిరికిపంద చర్య అని టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన జారీ చేశారు. చంద్రబాబుపై జరిగిన దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. ఈ దాడికి మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలో బాధ్యులని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు.  వైసీపీ గుండాయిజం, రౌడీయిజం, టీడీపీ ముందు చెల్లవని, ఇటువంటి చిల్లర వేషాలు వైసీపీ మానుకోవాలన్నారు. చంద్రబాబును రాళ్లతో కొట్టడం కాదని, ప్రజలే మిమ్మల్ని రాళ్లతో కొట్టేరోజు దగ్గరలోనే ఉందని జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు వైసీపీ నేతలను హెచ్చరించారు. 

చంద్రబాబుపై దాడిని ఖండిస్తున్నాం : ఆలపాటి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తున్నామని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రశ్నించే ప్రజాగొంతును జగన్‌రెడ్డి నులిమే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తిరుపతి పర్యటనలో టడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు గల ప్రజాదరణ చూసిన ముఖ్యమంత్రికి, వైసీపీ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. దాడులు  దౌర్జన్యాలు వైసీపీ డీఎన్‌లో ఉన్నాయన్నారు. కేవలం రెండేళ్లకే వైసీపీ అరాచకపు, మోసపూరిత పాలన ప్రజలకు అర్ధమైందన్నారు. జగన్‌ ఎన్ని కుట్రలు వేసినా తిరుపతిలో టీడీపీ విజయాన్ని ఆపలేరన్నారు. 

వైసీపీ గుండాయిజానికి పరాకాష్ట : నక్కా ఆనందబాబు 

అహంకారంతో విర్రవీగుతున్న వైసీపీకి గుణపాఠం తప్పదని, చంద్రబాబుపై దాడి వైసీపీ గుండాయిజానికి పరాకాష్ట అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడ్డారన్నారు. జడ్‌ కేటగిరి ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడితే ఇక రాష్ట్రంలో సామాన్యుని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  డీజీపీ తక్షణం తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేని సీఎం ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతల విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఆనందబాబు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-04-13T05:54:08+05:30 IST