Abn logo
Sep 18 2021 @ 00:35AM

గూండాల రాజ్యం ఇది

మాట్లాడుతున్న జ్యోతుల నవీన్‌కుమార్‌

 కాకినాడ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌
జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, సెప్టెంబరు 17: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి వైసీపీ నాయకుల గూండా రాజ్యానికి నిదర్శనమని కాకినాడ టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు. జగ్గంపేటలోని రావులమ్మనగర్‌ టీడీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం కాదు అనడానికి ఈ దాడే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వం పరిపాలన రౌడీ రాజ్యాన్ని తలపిస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని నవీన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప పార్టీలకు తొత్తులుగా మారకూడదని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన వైసీపీ ఇటువంటి పరిపాలన అందించడం విడ్డూరంగా ఉంద న్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇలా దాడులు చేస్తే భయబ్రాంతులకు గురవుతారని వైసీపీ అనుకోవడం మూర్ఖత్వపు ఆలోచన అన్నారు. రాష్ట్రంలో ప్రతీ టీడీపీ కార్యకర్త భారతదేశపు సైనికుడిలా పోరాడతాడన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇకనైన ఇలాంటి మూర్ఖత్వపు చర్యలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో జీను మణిబాబు, బుర్రి సత్తిబాబు, కోర్పు సాయితేజ పాల్గొన్నారు.