Advertisement
Advertisement
Abn logo
Advertisement

నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ వివక్ష: Achennaidu

అమరావతి: నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ వివక్ష చూపారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.  నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లు జగన్‌రెడ్డి సొంత వర్గానికా? కుర్చీలు లేని ఛైర్మన్‌లు బలహీనవర్గాలకా..? అని ప్రశ్నించారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని ఆగ్రహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల్ని డమ్మీల్ని చేశారన్నారు. నిధులు, అధికారాలు ఉన్న పదవుల్ని సొంత వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు కనీసం కుర్చీ కూడా లేని ఛైర్మన్ పదవుల్ని కేటాయించారన్నారు. రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో సింహభాగం ముఖ్యమంత్రి సామజిక వర్గంతో నింపుకున్నారని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో  రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని అన్నారు.


సబ్ ప్లాన్ నిధుల్లో కోత పెట్టారని... ఇళ్ల పట్టాల పేరుతో 10వేల ఎకరాలను బడుగుల అసైన్ మెంట్ భూముల్ని  లాక్కున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ మోసంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్లు కోల్పోతున్నారని తెలిపారు. దాడులు, అత్యాచారాలు, హత్యలతో తెగబడుతూ..బడుగులకు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో కీలక పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారని గుర్తుచేశారు.  నేడు జగన్‌రెడ్డి ఉన్నత పదవులన్నింటినీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారన్నారు. సామాజిక న్యాయం పేరుతో.. సామాజిక ద్రోహం చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Advertisement
Advertisement