MLA అయ్యుండి ఏంటిది.. తోపుదుర్తి వర్సెస్ పరిటాల!

ABN , First Publish Date - 2021-10-19T06:41:41+05:30 IST

మండలంలోని కుంటిమద్ది గ్రామంలో జనార్దన దీక్షితులు చెరువు కట్టపై ఏర్పాటుచేసిన పైలాన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

MLA అయ్యుండి ఏంటిది.. తోపుదుర్తి వర్సెస్ పరిటాల!

  • పైలాన్ శిలాఫలకం ధ్వంసం
  • ఆందోళనకు దిగిన పరిటాల సునీత, శ్రీరామ్‌


రామగిరి, అక్టోబరు 18: మండలంలోని కుంటిమద్ది గ్రామంలో జనార్దన్ దీక్షితులు చెరువు కట్టపై ఏర్పాటుచేసిన పైలాన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 2016లో కుంటిమది చెరువుకు నీరు తెచ్చి తెప్పోత్సవం నిర్వహించిన సందర్భంగా చెరువుకట్టపై పైలాన శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌తోపాటు పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ వర్గీయులు వందలసంఖ్యలో తరలివచ్చారు. మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌ మాట్లాడుతూ... అభివృద్ధికి చిహ్నంగా ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేయడం సిగ్గుచేటనీ, ఇది వైసీపీ నాయకుల పనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇలాంటి పనులు చేయమంటారా అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అభివృద్ధి చేసి, ఇలాంటి శిలాఫలకాలను నిర్మించుకోవాలనీ, అందుకు ఎవరూ అడ్డుచెప్పరన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి పనులు చేసి, ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరికాదని, వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఆవేదనతో ఆందోళన చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇచ్చిన హామీలు వట్టి మాటలుగానే మిగిలిపోయాయన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చిచ్చురేపుతున్నారన్నారు. వీలైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసి, శిలాఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి పనులు చేయించడం ఏంటని వారు నిలదీశారు. వైసీపీ పాలనను నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినదించారు. న్యాయం చేయాలంటూ పోలీసులు అక్కడికి వచ్చినపుడు నినాదాలు చేశారు. సీఐ చిన్నగౌస్‌, ఎస్‌ఐ నాగాస్వామి ఘటనపై విచారణ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాయంత్రం రామగిరి పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ధర్నాలో మాజీ ఎంపీపీ రంగయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామ్మూర్తినాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:41:41+05:30 IST