ఆర్టీసీలో ‘పన్ను’ బాదుడు

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో డీజిల్‌ పన్ను పేరుతో చార్జీలు పెంచింది. దీనివల్ల జిల్లాలో ప్రయాణికులపై రోజుకు సుమా రు రూ.4లక్షల చొప్పున నెలకు రూ.1.20 కోట్ల వరకు ప్రజలపై భారం పడ నుంది. దీంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల నుంచి డబ్బు పిండేందుకే డీజిల్‌పై పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలాడుతోం దని ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీలో ‘పన్ను’ బాదుడు
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రాయచోటి ఆర్టీసీ బస్టాండు

డీజిల్‌ పన్ను పేరుతో భారీగా పెరిగిన చార్జీలు 

జిల్లాపై నెలకు రూ.1.20 కోట్ల భారం

రాయచోటి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో డీజిల్‌ పన్ను పేరుతో చార్జీలు పెంచింది. దీనివల్ల జిల్లాలో ప్రయాణికులపై రోజుకు సుమా రు రూ.4లక్షల చొప్పున నెలకు రూ.1.20 కోట్ల వరకు ప్రజలపై భారం పడ నుంది. దీంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల నుంచి డబ్బు పిండేందుకే డీజిల్‌పై పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలాడుతోం దని ఆరోపిస్తున్నారు. 


భారీగా పెరిగిన చార్జీలు

రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ పన్ను పేరుతో భారీగా బస్సు ఛార్జీలను పెంచింది. సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ.. జిల్లాలో ఇప్పటికీ ఎక్కడా సిటీ బస్సు సర్వీసులు లేకపోవడంతో..  దీని వల్ల జిల్లాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. డీజిల్‌ పన్ను ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ఛార్జీలను ఒకసారి పరిశీలిస్తే.. 

ఫ పల్లె బస్సుల్లో రూ.10 - అల్ర్టా పల్లెవెలుగు బస్సుల్లోనూ రూ.10. - ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 - అల్ర్టా డీలక్స్‌ బస్సులో రూ.25, సూపర్‌ లగ్జరీలో రూ.40- ఇంద్ర బస్సుల్లో రూ.50, గరుడ బస్సుల్లో రూ.50- నైట్‌ రైడర్‌ బస్సులో రూ.50, నైట్‌ రైడర్‌ బెర్త్‌ బస్సులో రూ.80, వెన్నెల స్లీపర్‌ బెర్త్‌ బస్సుల్లో రూ.80, మెట్రో లక్సరీ బస్సుల్లో రూ.50 లెక్కన డీజిల్‌ పన్నును విధించారు. 


పల్లె వెలుగులో పెంపు ఇలా..

- 35- 60 కి.మీ. రూ.5, 65-70 కి.మీ. రూ.10, 75-95 కి.మీ. రూ.15, 100 నుంచి 120 కి.మీ. రూ.20 పెంచారు. ఎక్స్‌రఎస్‌ 0 నుంచి 30 వరకు ఎలాంటి పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ. రూ.5,  66 నుంచి 85 కిలోమీటర్లకు రూ.10, 86-125 కి.మీ. రూ.15, 126 నుంచి 145 కిలోమీటర్లకు రూ.20, 146 నుంచి 165 కి.మీ. రూ.25, 166 నుంచి 200 కి.మీ. రూ.30, 201 నుంచి 220 కి.మీ.కు రూ.35, 221 నుంచి 240 కి.మీ. రూ.40 పెంచారు.

పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో అదనంగా రూ.2, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులో రూ.5, ఏపీ బస్సుల్లో రూ.10 అదనంగా పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రభు త్వం డీజిల్‌పై పన్ను పేరుతో పెంచిన ఛార్జీల వల్ల జిల్లా ప్రజలపై రోజుకు దాదాపు రూ.4 లక్షల వరకు భారం పడనుంది. ఈ లెక్కన నెలకు రూ.1.20 కోట్ల వరకు భారం అవుతుంది. 


రోజుకు 36 వేల లీటర్ల డీజిల్‌ వినియోగం

జిల్లాలో రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె-1, మదనపల్లె-2 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఇందులో 340 పల్లెవెలుగు బస్సు సర్వీసులు, సూపర్‌లగ్జరీ 24, అల్ర్టా డీలక్స్‌ 40, ఎక్స్‌ప్రెస్‌ 95 సర్వీసులు రోజూ జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు సుమారు రోజుకు 1 లక్ష 90 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 1.70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీ సర్వీసుల కోసం రోజుకు సుమారు 36 వేల లీటర్ల డీజిల్‌ అవసరం అవుతోంది. ఈ లెక్కన నెలకు సుమారు రూ.9 కోట్లు డీజిల్‌ కోసం ఆర్టీసీ సంస్థ వ్యయం చేయాల్సి వస్తోంది. 


ఆర్టీసీకి గుదిబండగా కేంద్ర నిర్ణయం

సాధారణంగా గతంలో ఆయిల్‌ కంపెనీల నుంచి ఆర్టీసీ సంస్థ డీజిల్‌ కొనుగోలు చేసేది. రెండు వేల లీటర్ల కంటే ఎక్కువగా కొనుగో లు చేస్తే.. బల్క్‌ బయ్యర్‌ కింద, వీళ్లకు బయ ట మార్కెట్‌తో పోల్చితే సుమారు రూ.5లకు తగ్గించి డీజిల్‌ ఇచ్చేవాళ్లు. అయితే గత రెం డు నెలల కిందట బల్క్‌ బయ్యర్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ప్రస్తు తం ఏ డిపోకు .. ఆ డిపో స్థానికంగా ఉండే డీజిల్‌ బంకుల వద్ద డీజిల్‌ కొనుగోలు చేస్తు న్నారు.  దీని వల్ల బయట మార్కెట్‌ కంటే.. కేవలం ఒక రూపాయి వరకు మాత్రమే తక్కువ ధరకు డీజిల్‌ లభిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో లీటర్‌ డీజిల్‌ను ఆర్టీసీ రూ.99కు కొంటున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం లీటర్‌కు సుమారు రూ.4 అదనంగా వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.1.44 లక్షలు అదనంగా జిల్లా ఆర్టీసీపైన భారం పడుతోంది. 


కొనుగోలు బాధ్యత ఆర్టీసీకే

ఆర్టీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వం తమ స్వాధీ నంలోకి తీసుకుని అందులో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు కేవలం వేతనాలు మాత్రమే ఇస్తున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొంటున్నారు. క్రమంగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు, కరోనా కారణంగా దారుణంగా పడిపోయిన ఆక్యుపెన్సీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ పన్ను పేరుతో ఛార్జీలు పెంచుతోందని పలువురు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్‌ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరల ప్రకారం ఆర్టీసీకి ఇవ్వకుండా వాళ్లే స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం కూడా ఆర్టీసీకి అదనపు భారంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డీజిల్‌ కొను గోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం టే.. ఆర్టీసీకి ఎంతో కొంత ఊరట ఉండేదని పేర్కొంటున్నారు. అప్పుడు ప్రజలపై ఈ స్థాయిలో భారం వేయాల్సిన అవసరం ఉండే ది కాదని పేర్కొంటున్నారు. 


ఆర్టీసీపై పడ్డారు..

రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి ఆస్తులన్నీ అయిపోయి చివరకు ఆర్టీసీ మీద పడ్డారు. ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచడం అనేది సామాన్యులపైన పెద్ద బండరాయి వేయడం లాంటిదే. ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు పెరిగి సొంత వాహనాల జోలికి వెళ్లడం మానేసిన మధ్యతరగతి వాళ్లు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే అవకాశం కూడా ఉండదు.

- ప్రసాద్‌, వ్యాపారి, పీలేరు


పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహ రించుకోవాలి. సంక్షేమం పేరుతో ప్రజలపై రోజుకో భారం వేస్తున్నారు. బస్సు చార్జీలు పెంచడం మూలిగే నక్కపై తాటికాయ పడిన ట్లుగా ఉంది. జగన్‌ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల ను మూడేళ్లలో ఇప్పటికే మూడు సార్లు పెంచింది. 

- శ్రీనివాసులు, సీపీఎం జిల్లా కార్యదర్శి, మదనపల్లె

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST