ప్రముఖుల నివాసాలే టార్గెట్‌

ABN , First Publish Date - 2021-05-13T05:13:56+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ప్రముఖల నివాసాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను విశాఖ సీసీఎస్‌, పీఎంపాలెం క్రైమ్‌ పోలీసులు సంయుక్తంగా బుధవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి చోరీ సొత్తు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యాపారులను కూడా అరెస్టు చేసి, రూ.4,49,500 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖుల నివాసాలే టార్గెట్‌

అంత ర్‌రాష్ట్ర దొంగ అరెస్టు

విశాఖ, హైదరాబాద్‌లో పలు చోరీలు

ఈ ఏడాది జనవరిలో గంటా కుమార్తె ఇంట్లో దొంగతనం

నిందితుడితోపాటు ఇద్దరు రిసీవర్లు అరెస్టు

రూ.4,49,500 విలువచేసే సొత్తు స్వాధీనం


విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ప్రముఖల నివాసాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను విశాఖ సీసీఎస్‌, పీఎంపాలెం క్రైమ్‌ పోలీసులు సంయుక్తంగా బుధవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి చోరీ సొత్తు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యాపారులను కూడా అరెస్టు చేసి, రూ.4,49,500 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పెందుర్తి గౌరీష్‌ అలియాస్‌ రాజు అలియాస్‌ ఆర్యన్‌ అలియాస్‌ పిల్లికళ్లు రాజు (27) ఐదో తరగతి వరకూ చదువుకుని వ్యసనాలకు బానిసై చోరీల బాటపట్టాడు. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో రెండు, కంచరపాలెం స్టేషన్‌ పరిధిలో ఒక ఇంటిలో చోరీకి పాల్పడడంతో పోలీసులు 2010లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చేశాడు. 2010 నుంచి 2017 మధ్య కాలంలో జూబ్లిహిల్స్‌ ఏరియాలో సినీ నటులు, మంత్రులు, రాజకీయ  నేతల నివాసాల్లో చోరీలు చేశాడు. దీంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయదుర్గం వెళ్లాడు. అక్కడ ముగ్గురు ప్రముఖుల ఇళ్లలో చోరీలు చేశాడు. అక్కడ పోలీసులు అరెస్టు చేయడంతో గత ఏడాది డిసెంబరులో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి విశాఖ చేరుకున్నాడు. జనవరి 11న రుషికొండలో ప్రముఖులు నివాసం వుండే బాలాజీ బే మౌంట్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోకి వెనుక వైపు ప్రహరీ దూకి చొరబడ్డాడు. అందులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజితకు చెందిన విల్లాలో చొరబడి 99 గ్రాముల బంగారం, 2,847 గ్రాముల వెండి, ఒక స్మార్ట్‌ వాచ్‌ సహా రూ.4,62,500 విలువైన సొత్తును అపహరించుకుని పోయాడు. దీనిపై సాయిపూజిత ఇంట్లో పనిచేసే బంటు సత్యారావు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో పిల్లికళ్లు రాజును నిందితుడిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. సొత్తును నగరంలోని కురుపాం మార్కెట్‌కు చెందిన పుట్టా భరత్‌కుమార్‌ (24), కొమ్మూరి వీరభద్రరావు (59)కు విక్రయించినట్టు చెప్పాడు. దీంతో వారిని విచారించగా నేరం అంగీకరించడంతోపాటు తాము కొనుగోలు చేసిన రూ.4,49,500 విలువ చేసే చోరీ సొత్తును పోలీసులకు అప్పగించారు. ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ సీఐ రామచంద్రరావు, నార్త్‌ క్రైమ్‌ సీఐ సూరినాయుడును సీపీ అభినందించారు.

Updated Date - 2021-05-13T05:13:56+05:30 IST