పదే పదే Jagan Sarkar అశోక్‌ గజపతిని ఎందుకు టార్గెట్ చేస్తోంది..!?

ABN , First Publish Date - 2021-12-23T04:56:11+05:30 IST

ప్రభుత్వం మొదటి నుంచి మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌.. రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై రామాలయ శంకుస్థాపన విషయాన్ని కూడా ఆయనకు ముందుగా తెలియపరచలేదు.

పదే పదే Jagan Sarkar అశోక్‌ గజపతిని ఎందుకు టార్గెట్ చేస్తోంది..!?

ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నాలు

నాడు మాన్సాస్‌ చైర్మన్‌గా తొలగింపు

తాజాగా ఆయనకు తెలియకుండా ఆలయ శంకుస్థాపన ఏర్పాట్లు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం మొదటి నుంచి మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌.. రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై రామాలయ శంకుస్థాపన విషయాన్ని కూడా ఆయనకు ముందుగా తెలియపరచలేదు. శిలాఫలకంలో ఆయన పేరును కూడా కన్పించని విధంగా ఓ మూలన చేర్చారు. గత ఏడాది రాముని ఆలయంలో విగ్రహ శిరస్సును తొలగించిన సంఘటనను కూడా ప్రభుత్వం రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అనేక మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తరువాత అరెస్టు చేసిన టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.  రామతీర్థంతో పాటు పైడితల్లి దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ను తొలగించి వేరే ట్రస్టు బోర్డును ఏర్పాటు వేశారు. ఇది చెల్లదని కోర్టు ఆదేశించడంతో మళ్లీ అనువంశిక ధర్మకర్తగా అశోక్‌ బాధ్యతలు చేపట్టారు. రామతీర్థం రామాలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందిస్తే దానిని అశోక్‌కు వెనక్కు పంపించారు. ఇలా ప్రభుత్వం అశోక్‌ను అనేకసార్లు అవమానాలకు గురిచేస్తూ వస్తోంది. 

 మాన్సాస్‌ ట్రస్టు ఏర్పాటు చేసింది పూసపాటి రాజవంశీయులు. చైర్మన్లుగా ఆ వంశీయులైన పురుషులకే అవకాశం కల్పిస్తూ బైలాను పీవీజీ రాజు రిజిస్టర్‌ చేయించారు. దీనిని కాదని ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తెను మాన్సాస్‌ చైర్మన్‌గా ఏడాదిన్నర కిందట ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనిపైనా అశోక్‌ గజపతిరాజు కోర్టును ఆశ్రయించారు. తిరిగి ఆయనకే అవకాశం కల్పిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం మాన్సాస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ను గతంలో తొలగించడం, ఆ తరువాత కోర్టు ఆదేశాలతో చైర్మన్‌గా కొనసాగటం తెలిసిందే. ఇలా ప్రభుత్వం అనేక సందర్భాల్లో అశోక్‌ను ఇబ్బందులు పెట్టింది. 

 ఆలయాల వద్ద రాజకీయ రంగు ఎందుకని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి శంకుస్థాపనకు మంత్రులు పోటీపడి హాజరుకావడం దేనికని ప్రశ్నించారు. అనువంశిక ధర్మకర్తను గౌరవించకపోవడం సరికాదన్నారు. ఘటనపై ఎమ్మెల్సీ మాధవ్‌ కూడా స్పందించారు. చైర్మన్‌గా ఉన్న అశోక్‌ను ఆహ్వానించి అవమానపర్చటం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులన్నీ అశోక్‌కు జరిగిన అవమానంపై ధ్వజమెత్తాయి. టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ అశోక్‌ను అవమానపర్చడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌పీ భంజ్‌దేవ్‌, బొబ్బిలి చిరంజీవులు, కర్రోతు బంగార్రాజు, సువ్వాడ రవిశేఖర్‌ తదితరులు అశోక్‌ను కలిశారు. 



Updated Date - 2021-12-23T04:56:11+05:30 IST