దెబ్బకు దిగొచ్చిన ‘తనిష్క్’

ABN , First Publish Date - 2020-10-13T23:08:54+05:30 IST

ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ తాజాగా చేసిన ఓ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాతీయవాదులు ఈ యాడ్‌పై

దెబ్బకు దిగొచ్చిన ‘తనిష్క్’

న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ తాజాగా చేసిన ఓ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాతీయవాదులు ఈ యాడ్‌పై మండిపడుతున్నారు. తనిష్క్ తన వాణిజ్య ప్రకటనతో ‘లవ్ జిహాద్’ను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు.


అంతేకాదు, #BoycottTanishq పేరుతో తనిష్క్‌ను బహిష్కరించాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిస్తున్నారు. దీంతో సోమవారం నుంచి ఈ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో వెనక్కి తగ్గిన తనిష్క్ తన యాడ్‌ను ఉపసంహరించుకుంది.


తనిష్క్ తన కొత్త జ్యూయలరీ లైన్‌లో ‘ఏకత్వం’ పేరుతో కొత్త ఆభరణాలను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన యాడ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. హిందూ యువతి పెళ్లి చేసుకుని ముస్లిం కుటుంబంలోకి అడుగుపెట్టింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా వేడుక నిర్వహించేందుకు గార్డెన్‌లో ఏర్పాట్లు చేశారు. యువతిని ఆమె అత్తయ్య గార్డెన్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఏర్పాట్లు హిందూ సంప్రదాయంలో ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతుంది.


‘‘ఇలాంటి వేడుకలు మీ ఇంట్లో చేయరు కదా, నిజమేనా?’’ అని యువతి ప్రశ్నిస్తుంది. దీనికి ఆమె అత్త బదులిస్తూ ‘‘అమ్మాయి సంతోషంగా ఉండేందుకు ప్రతి ఇంట్లోనూ వేడుక నిర్వహిస్తారు, కాదా?’’ అని అంటుంది. ‘‘తనను సొంత అమ్మాయిలా ప్రేమించే కుటుంబంలోని వ్యక్తిని పెళ్లాడింది. ఆమె కోసం వారు తమ మతాచారానికి భిన్నంగా వేడుక నిర్వహించారు. రెండు వేర్వేరు మతాలు, సంస్కృతి,  ఆచారాల అద్భుత కలయిక ఇది’’ అని తనిష్క్ దీనిని వర్ణించింది. 


అయితే, ఈ యాడ్ ‘లవ్ జిహాద్’ను ప్రేరేపించేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. తనిష్క్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ జాతీయ వాదులు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. #BoycottTanishq పేరుతో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తనిష్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి దీనిని తొలగించింది.


అయితే, అప్పటికే దానిని సేవ్ చేసుకున్న వారు ఆ వీడియోను షేర్ చేస్తూ తనిష్క్ తీరుపై మండిపడుతున్నారు. తమ కుమార్తెలను లవ్ జిహాద్ నుంచి కాపాడుకుంటామని, వారి జీవితాలను కాపాడతామని పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు, అవసరమైతే  చట్టపరంగానూ పోరాడతామని హెచ్చరించారు.  హిందూ కోడలే ఎందుకు ఉండాలని, ముస్లిం కోడలు ఎందుకు ఉండకూడదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 


అయితే, కొందరు మాత్రం తనిష్క్‌కు అండగా నిలుస్తున్నారు. అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా తనిష్క్‌కు మద్దతుగా పోస్టు చేశారు. తనిష్క్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ముందుకొస్తున్న వారిని ‘హిందూ దురభిమానులు’గా పేర్కొన్నారు.


‘‘ఈ అద్భుతమైన యాడ్ ద్వారా హిందూ, ముస్లిం ఏకత్వాన్ని చూపించారు. హిందూముస్లిం ‘ఏకత్వం’ వారిని అంతగా ఇబ్బంది పెడుతుంటే, ఈ ప్రపంచం, ఇండియాలో ఎప్పటి నుంచే ప్రతీకగా ఉన్న హిందూముస్లిం ఐక్యతను బాయ్‌కాట్ చేయమని ఎందుకు పిలుపునివ్వడం లేదు’’ అని శశిథరూర్ ప్రశ్నించారు.   




Updated Date - 2020-10-13T23:08:54+05:30 IST