వనితకు హోం!

ABN , First Publish Date - 2022-04-12T06:35:10+05:30 IST

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తానేటి వనితకు మరోసారి అదృష్టం వరించింది. కీలకమైన రాష్ట్ర హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ లభించింది. ఆమె రాజయోగం కొనసాగుతోంది. సీఎం జగన్‌ మొదటి కేబినెట్‌లో మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రిగా సుమారు మూడేళ్లు కొనసాగిన

వనితకు హోం!
వెలగపూడిలో సోమవారం మంత్రిగా ప్రమాణం చేస్తున్న తానేటి వనిత

కలసి వచ్చిన సమీకరణాలు

వరించిన కీలక పదవి

అనుచరుల సంబరాలు

నేడు గుండుగొలనులో స్వాగతం

 ర్యాలీతో కొవ్వూరు రాక

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తానేటి వనితకు మరోసారి అదృష్టం వరించింది. కీలకమైన రాష్ట్ర హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ లభించింది. ఆమె రాజయోగం కొనసాగుతోంది. సీఎం జగన్‌ మొదటి కేబినెట్‌లో  మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రిగా సుమారు మూడేళ్లు కొనసాగిన ఆమెకు మళ్లీ పదవి లభించింది. ఈసారి ఏకంగా  హోంశాఖే లభించింది. సోమవారం ఆమె జగన్‌ మంత్రిమండలి విస్తరణలో భాగంగా మళ్లీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మధ్యలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఆమె మంత్రి పదవి లేకుండా ఉన్నారు. జగన్‌ ఆదేశంతో కేబినెట్‌ మొత్తం రాజీనామా చేయడంతో ఆమె కూడా రాజీనా మా చేసిన సంగతి తెలిసిందే. గతంలో మహిళా శిశు సంక్షే మం మంత్రిగా పనిచేస్తే, ఇప్పుడు శాంతిభద్రతలు, పౌరుల రక్షణ, విపత్తుల నిర్వహణ వంటి బాధ్యతలు ఉంటాయి. విద్యావంతురాలైన మంత్రి తానేటి వనితకు ఇదొక గొప్ప అవకాశంగానే చెప్పాలి. తన తండ్రి నుంచి రాజకీయ వారసురాలిగా ప్రజల్లోకి వచ్చిన వనిత రాజకీయ అనుభవాలు బాగా గడించారు. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నుంచి రాజకీయా లు నేర్చుకుని, 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్‌ జవహర్‌ చేతిలో ఓడిపోయారు. 2019లో తిరిగి ఆమె పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై సుమారు 25వేల ఓట్లకు పైగా ఆధిక్యతతో గెలిచారు. ఒకప్పటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరులో కృష్ణబాబు తదితరులు వైసీపీకి మా రడంతో కొంత పరిస్థితి మారింది. ప్రస్తుతం ఆమెకు జిల్లా పార్టీలోని పరిస్థితులు, తన సామాజికవర్గం, మహిళ కావ డం కలసివచ్చింది. తండ్రి బాబాజీరావు రాజకీయం, తల్లి టీచర్‌ కావడంతోపాటు వనిత భర్త డాక్టర్‌ కూడా. తాడేపల్లిగూడెంలో హాస్పటల్‌ ఉంది. మంత్రి స్థిర నివాసరం తాడేపల్లిగూడెంలోనే. కొవ్వూరులో క్యాంపు ఆఫీసుకు వస్తుంటారు.


 రాజమహేంద్రవరం విద్యార్థిని..

 హోంమత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలోనూ చదువుకున్నారు. ఎస్‌కెఆర్‌ఎల్‌ మహిళా కాలేజిలో ఆమె బీఎస్సీ (బీజడ్‌సీ) చదివారు. దేవరపల్లి మండలంలోని యర్నగూడెంలో టెన్త్‌ చదివారు. ఏలూరులోని సీహెచ్‌ఎస్‌ డి. సెయింట్‌ థెరిస్సా కాలేజీలో ఇంటర్‌, విశాఖ ఏయూలో ఎంఎస్సీ (జువాలజీ) చదివారు. 49 ఏళ్ల వనిత ఉన్నత చదువులతోపాటు, తండ్రి రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె మంగళవారం విజయవాడ నుంచి జిల్లాకు రానున్నారు. ఏలూరు జిల్లా గుండుగొలను నుంచి   ర్యాలీగా కొవ్వూరు చేరుకుంటారు.


తొలిసారిగా..

గోదావరి జిల్లాలో గతంలో కొందరు హోంమంత్రి పదవులు నిర్వహించారు. టీడీపీ హ యాంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా పనిచేశారు. కానీ ఒక మహిళ హోంమంత్రి కావడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి. పునర్విభజన తర్వాత జిల్లాలో ఏకైక మంత్రి ఆమెనే. 


హోంశాఖ ఓ చాలెంజ్‌..

హోంశాఖ ఆమెకు పెద్ద చాలెంజ్‌ అవు తుందనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో  శాంతిభద్రతల పరిస్థితిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వివిధ వర్గాలపై రాజకీయ కక్షలు కడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, దళితులకు ఆమె ఎంతవరకు అండగా నిలుస్తారనేది చర్చనీయాంశమైంది. దిశ పోలీసులు స్టేషన్లు ఉన్నా మహిళలకు పెద్దగా న్యాయం లేదనే వాదన ఉంది. దళితుల విషయంలో న్యాయం జరగడంలేదనేది ఉంది. ఆమె దళిత మహిళగా ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Updated Date - 2022-04-12T06:35:10+05:30 IST