టమోటా నారుకూ డిమాండ్‌

ABN , First Publish Date - 2022-05-23T06:48:56+05:30 IST

మార్కెట్‌లో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

టమోటా నారుకూ డిమాండ్‌

అయినా దొరకని దుస్థితి..

నెలరోజులు ఆగాల్సిందే..!

తనకల్లు, మే 22: మార్కెట్‌లో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట నారు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ధర రెటింపైంది. అయినా.. కొందామన్నా దొరకట్లేదు. దీంతో పక్క ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. కదిరి ప్రాంతంలో ఏ సమయంలో అయినా రైతన్నలు టమోటా సాగు చేస్తారు. ఖరీఫ్‌, రబీ అనే కాకుండా వ్యవసాయ బోర్ల కింద నిత్యం సాగులో ఉండే పంట టమోటా. అలాంటి టమోటా సాగుచేయడానికి రైతులకు నారు దొరకట్లేదు. దీంతో రైతులు టమోటా నారు కోసం కర్ణాటక, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వైపుకూడా వెళ్తున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల్లో టమోటా నారు ధరలు రెట్టింపయ్యాయి. గతంలో 40 నుంచి 50 పైసలున్న ఒక మొక్క ధర అమాంతం పెరిగిపోయింది. అంత ధర చెల్లించినా దొరకట్లేదు.


టమోటా ధరలు  పెరగడంతో..

టమోటా ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఒక్కసారిగా కదిరి ప్రాంతంలోని రైతులు టమోటా సాగువైపు దృష్టి సారించారు. దీంతో టమోటా నారు ధరలు రెట్టింపయ్యాయి. రెండు సంవత్సరాలుగా కరోనా దెబ్బకు టమోటా సాగుచేసిన రైతు నష్టాలను మూటగట్టుకున్నాడు. ఆరేడేళ్లుగా ఏప్రిల్‌, మే నెలల్లో టమోటా సాగుచేసిన రైతులు నష్టపోవడంతో ఈ ఏడాది పంట సాగు తగ్గించారు. ఫలితంగా కదిరి ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. తనకల్లు మండలంలో 25 శాతానికి పడిపోయింది. వెరసి టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.100 మార్కు దాటడంతో పంట సాగుచేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏటా ఏప్రిల్‌, మే నెలలో పంట పెట్టే రైతులు నష్టపోయేవారు. ఈసారి మాత్రం రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు.


రెట్టింపైన నారు ధర

రెండేళ్లుగా కరోనా వ్యాప్తితో టమోటాకు ధర దక్కలేదు. మార్కెట్లో కొనేవారు లేక రోడ్లపక్కన పడేశారు. కొందరైతే పొలాల్లోనే వదిలేశారు. దీంతో ఈసారి ఎండాకాలంలో టమోటా సాగు చేసే సాహసం ఎవరూ చేయలేదు. అనూహ్యంగా ధర పెరగడంతో రైతులు ఇప్పుడు టమోటా నారు కోసం నర్సరీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా నర్సరీల యజమానులు తమ వద్ద ఉన్న నారు ధరలను రెండింతలు పెంచి, అమ్ముతున్నారు. గతంలో ఒక మొక్క 40 నుంచి 50 పైసలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.20కి చేరింది. ఎకరాలో పంట సాగుకు దాదాపు 10 వేల మొక్కలు అవసరం. ఆ లెక్కన నారుకే రూ.12 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. నారు ఇప్పుడు నాటినా మంచి ధర దక్కే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు పంట వచ్చినా వర్షాలకు టమోటా దిగుబడి తక్కువగా ఉంటుందని నమ్మకం. అందువల్ల ఖర్చయినా సాగు తప్పని పరిస్థితి.


తగ్గిన సాగు విస్తీర్ణం

వరుసగా రెండు సంవత్సరాలు కరోనా వ్యాప్తితో రైతులు పండించిన టమోటా పంటకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడ్డారు. పంట విస్తారంగా పండినా.. కిలో రూపాయికి కూడా కొనేవారు లేక నష్టాలు మూటగట్టుకున్నారు. కదిరి డివిజనలో గతంలో ఎండాకాలం దాదాపు రెండు వేల ఎకరాల్లో పంట సాగు చేస్తుండేవారు. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా పంట పెట్టలేదు. ఇప్పుడు టమోటా ధర విపరీతంగా పెరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తాము పంట వేస్తే ధర ఉండదు, ధర వచ్చినపుడు పంట ఉండదు అని వాపోతున్నారు.


రెట్టింపయ్యాయి..

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు టమోటా సాగుచేసిన రైతులు నష్టాల పాలయ్యారు. దీంతో పుష్కలంగా నీరున్నా.. టమోటా సాగు చేయలేదు. ప్రస్తుతం పంట పెడదామంటే నారు ధరలు రెట్టింపయ్యాయి. అడిగిన ధర చెల్లిస్తామన్నా నెలరోజులు ఆగాల్సి వస్తోంది. 

- బ్రహ్మానందరెడ్డి, యర్రబల్లి


అప్పట్లో ధరలు లేవు.. ఇప్పుడు నారు లేదు..

నాలుగు నెలలుగా టమోటా నారుకు ధరలు లేక అడిగే రైతులు లేక పెంచిన నారు సైతం పడేయాల్సి వచ్చింది. లక్షల్లో  మొక్కల వృథా అయ్యాయి. ప్రస్తుతం నారు ధరలు రెట్టింపైనా ఏ నర్సరీ యజమాని వద్దా అందుబాటులో లేదు. నారు రావాలంటే నెలరోజులు ఆగాల్సి వస్తోంది. ఈ కారణంగా నర్సరీ యజమానులు రెండువిధాలా నష్టపోయాం.

- రమేష్‌, నర్సరీ యజమాని


ధరల నియంత్రణకు చర్యలు

రెండుమూడేళ్లుగా వేసవిలో సైతం టమోటాలకు ధరలు లేక రైతులు పొలాల్లోనే వదిలేశారు. ఈ ఏడాది నీళ్లున్నా రైతులు టమోటా సాగు చేయలేదు. సాగు విస్తీర్ణం తగ్గి ధరలు పెరిగాయి. ప్రస్తుతం నారు ధరలు పెరిగినట్లు మా దృష్టికొచ్చింది. వాటిని నియంత్రించే విషయంపై ఉన్నతాఽధికారులతో చర్చిస్తున్నాం.

రాంప్రసాద్‌, ఉద్యాన శాఖాధికారి, తనకల్లు


Updated Date - 2022-05-23T06:48:56+05:30 IST