Abn logo
Sep 13 2021 @ 02:10AM

చైనాకు తాలిబాన్ల రిటర్న్‌గిఫ్ట్‌!

  • ఈటీఐఎం మూకలకు దేశం వీడాలని ఆదేశం
  • ఉయ్‌గర్‌ల తరఫున ఈటీఐఎం పోరు
  • జూలైలో ఖతార్‌లో చర్చలు జరిపింది అందుకే..!!

కాబూల్‌, సెప్టెంబరు 12: తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తామని, అంతర్జాతీయ సమాజం కూడా వారిని ఆదరించాలని ప్రకటనలు చేస్తూ వచ్చిన డ్రాగన్‌ దేశం చైనాకు తాలిబాన్లు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారా? అంతా అనుకుంటున్నట్లు బగ్రామ్‌ ఎయిర్‌బే్‌సను అప్పగించడం కాకుండా.. అంతకు మించి విలువైన బహుమతి అందజేసిందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. చైనాకు మింగుడు పడని ఉగ్రవాద సంస్థ ఈస్ట్‌ తుర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌(ఈటీఐఎం)ను తమ దేశం నుంచి పంపించేయడమే డ్రాగన్‌కు తాలిబాన్లు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్‌. తాలిబాన్లు అఫ్ఘాన్‌ను ఒక్కో ప్రావిన్సుగా ఆక్రమించడం ప్రారంభించిన తొలిరోజుల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ యీ ఖతార్‌లోని తాలిబాన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఈటీఐఎం గురించే చైనా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటీఐఎం ఉగ్ర సంస్థ చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉయ్‌గర్‌ ముస్లింల తరఫున పోరాడుతోంది. జిన్‌జియాంగ్‌ స్వాతంత్య్రం కోసం వేర్పాటువాదాన్ని అందుకుంది. అఫ్ఘాన్‌తో చైనా 75 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నది కూడా జిన్‌జియాంగ్‌ ప్రావిన్సును ఆనుకుని ఉండడం గమనార్హం..! ఈ నేపథ్యంలోనే చైనాకు-తాలిబాన్లకు మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. తాలిబాన్లు ఈటీఐఎం ఉగ్రవాదులను నేరుగా అరెస్టు చేసి, చైనాకు అప్పగిస్తే ఇస్లామిక్‌ మత సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈటీఐఎం సభ్యులను సున్నితంగా తమ దేశాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ విషయాన్ని తాలిబాన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షాహిన్‌ శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారించారు. చైనాకు రిటర్న్‌ గిఫ్ట్‌ అని కాకుండా.. ‘‘అఫ్ఘాన్‌ గడ్డపై ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు తావు ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు. అల్‌-ఖాయిదా, ఐఎ్‌స-కేలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.


మహిళల ఉన్నత విద్యకు ఓకే.. కానీ..!

అఫ్ఘాన్‌లో కొలువుదీరిన తాలిబాన్ల సర్కారు తాజాగా కొత్త విద్యావిధానాన్ని ప్రకటించింది. తాలిబాన్ల గత పాలనలో బాలికలు 5వ తరగతి వరకే చదవాలని, ఆపై చదువులపై నిషేధం విధించింది. ఇప్పుడు మాత్రం మహిళలు ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఆపద్ధర్మ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. అయితే.. మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు తప్పనిసరి అన్నారు. అలా కుదరకుంటే వేర్వేరు తరగతులు ఉండాల్సిందేనని, సిలబ్‌సను కూడా సమీక్షిస్తామని వివరించారు. బాలికలు, మహిళలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ఉంటుందని, ముఖం కప్పుకొనేలా నకాబ్‌, హిజాబ్‌ తప్పనిసరి అని వెల్లడించారు. కాగా.. తాలిబాన్ల భయంతో అఫ్ఘాన్‌లోని సంగీతకారులు పాకిస్థాన్‌కు వలస వెళ్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంగీతకారులు పేషావర్‌ చేరుకున్నారు. కాగా, కాబూల్‌ విమానాశ్రయంలో 12 మంది మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరారు. వారంతా భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. డొమెస్టిక్‌ విమాన సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. మహిళా ప్రయాణికులను వారు తనిఖీ చేస్తారు.

గత నెల కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐఎ్‌స-కే మానవ బాంబు దాడుల తర్వాత అమెరికా డ్రోన్‌ దాడులు చేసిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో పేలుడు పదార్థాలతో ఓ కారులో వెళ్తున్న ఐఎ్‌స-కే ఉగ్రవాదిని మట్టుబెట్టామని ప్రకటించింది. అయితే.. ఆ చనిపోయిన వ్యక్తి జెమారీ అహ్మదీ(43) అనే సాధారణ పౌరుడని, కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని తేలింది.


నా కోసం వేట.. నేను దొరకలేదు: జబియుల్లా

అమెరికా నేతృత్వంలోని అఫ్ఘాన్‌ సర్కారు నా కోసం వేటాడని రోజు లేదు. నేను కాబూల్‌లోనే ఉంటూ.. తాలిబాన్ల పోరాటాలను మీడియాకు అందజేసేవాడిని. ఒక దశలో అమెరికన్లు ‘జబియుల్లా ముజాహిద్‌’ అనేది ఓ కల్పిత పేరు మాత్రమే అని నమ్మారు. నా కోసం వేటాడని రోజు లేదు. ఇన్ఫార్మర్లకు డబ్బులిచ్చి, నా జాడకు ప్రయత్నించేవారు. నేను వారి తనిఖీల నుంచి చాలా సందర్భాల్లో తెలివిగా తప్పించుకున్నా. కానీ, ఏనాడూ భయపడి కాబూల్‌ను, అఫ్ఘాన్‌ను వీడాలనుకోలేదు. తాలిబాన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌(ఒంటికన్ను ఒమర్‌)ను నేనెన్నడూ చూడలేదు. కానీ, ఆయన వారసులు షేక్‌ ముల్లా మన్సూర్‌, షేక్‌ హెబతుల్లాతో కలిసి పనిచేశాను.