కాబూల్: పట్టపగలు కాల్పులకు తెగబడ్డ తాలిబన్లు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ఇటీవల జలాలాబాద్ నగరంలో ఈ దారుణం జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పది మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు. తాలిబన్ పాలనకు నిరసనగా కొందరు స్థానికులు అఫ్ఘాన్ జాతీయ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించడంతో తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. తాలిబన్ల పతాకానికి బదులు అఫ్ఘాన్ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు స్థానికులు ప్రయత్నించారని తెలుస్తోంది. తిరుగుబాటును ఏమాత్రం సహించని తాలిబన్లు ఈ దుశ్చర్యకు దిగారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. నిరాయుధులైన వారిపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారట. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.